శ్రీసిటీ తరహాలో… ఇండస్ట్రియల్ జోన్లు..
1 min readఅక్కడ అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత మనదే..
- రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
–ఏపీఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి
మంగళగిరి, పల్లెవెలుగు: రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజు, కమిషనర్ శ్రీధర్‌తో పాటు అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ జోన్ల గురించి మంత్రి ఆరా తీశారు. భూముల విలువ, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు, ల్యాండ్ అలాట్‌మెంట్ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వెళ్లాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఉన్న పాత ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్క్ స్థలాలు నగరాల్లో కలిసి పోయింటే వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో ఆక్రమణకు గురవ్వకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలన్నారు.
పారిశ్రామిక వేత్తలకు.. పాజిటివ్ సంకేతం...
సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో పారిశ్రామికవేత్తలకు పాజిటివ్ సంకేతం ఇప్పటికే వెళ్లిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో మంది పెట్టుబడిదారులు చర్చలు జరుపుతున్నారని.. ఇండస్ట్రియల్ జోన్లలో అన్ని సమస్యలు పరిష్కరించి వారికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అధికారులకు తెలియజేశారు. ల్యాండ్ రేట్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలన్నీ ఒక కొలిక్కి తీసుకురావాలన్నారు. శ్రీసిటీ తరహాలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని మంత్రి టి.జి భరత్ సూచించారు. త్వరలోనే విజయవాడ, విశాఖతోపాటు ఇతర ఇండస్ట్రియల్ జోన్లను సందర్శిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్ జోన్ల అభివృద్ధిలో కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జెడ్.ఎంలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.