గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి వీరికి మినహాయింపు కల్పించాలి
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి గర్భిణీ ఉపాధ్యాయినులు, పాలిచ్చే తల్లులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, అలాగే 55 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు/ఉపాధ్యాయినులకు మినహాయింపు కల్పించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా శాఖ కోరింది.ఈ మేరకు డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. భీమన్న, రాష్ట్ర కార్యదర్శి గట్టు తిమ్మప్ప శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)ని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల విధులు సాధారణంగా ఎక్కువ సమయం పాటు కొనసాగడంతో పాటు ప్రయాణం, పని ఒత్తిడి, నిరంతర విధి నిర్వహణ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో గర్భిణీ ఉపాధ్యాయినులు, పాలిచ్చే తల్లులు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, 55 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించడంలో శారీరకంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.అందువల్ల మానవతా దృక్పథంతో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కర్నూలు జిల్లా వ్యాప్తంగా పై వర్గాలకు చెందిన అర్హులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులను గుర్తించి రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు.ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని డీటీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.


