టీడీపీ, జనసేన కలిస్తే రాయలసీమలో జగన్ పరిస్థితి ఏంటి ?
1 min readటీడీపీ, జనసేన పొత్తు వైసీపీలో గుబులు రేపుతోంది. రెండు పార్టీల పొత్తుతో భయంపట్టుకుంది. పెట్టని కోటలా మారిన సీమలో గండి పడుతుందన్న గుబులు మొదలయింది. 2019లో రాయలసీమ జగన్ కు తిరుగులేని మెజార్టీ ఇచ్చింది. 52 సీట్లలో 49 సీట్లను వైసీపీకి కట్టబెట్టింది. కానీ జగన్ సీమకు జగన్ చేసింది ఏమీ లేదు. బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. సీమలో ఓ కొత్త పరిశ్రమ పెట్టలేదు. ఓ రోడ్డు వేయలేదు. ఉన్న పరిశ్రమల్నే పారిపోయేలా చేసిన ఘనత వైసీపీది.
2014 ఎన్నికల్లో అనంతపురం మినహా మిగిలిన సీమ జిల్లాల్లో వైసీపీకి మంచి మెజార్టీ వచ్చింది. ఆ అనుభవంతో జగన్ అనంతపురంలో సామాజిక సమీకరణాల్ని పాటించారు. 2019 ఎన్నికలు మిగిలిన మూడు జిల్లాలతో పాటు అనంతపురం కూడ సులువుగా వైసీపీ ఖాతాలో పడిపోయింది. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. రాజకీయంగా రెడ్డి సామాజికవర్గం ముందు వరుసలో ఉండటం జగన్ కు కలిసొచ్చిన అంశం. కానీ అనంతపురంలో బీసీల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ బీసీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే ఒరవడిని 2024 ఎన్నికల్లో కూడ కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
2019కి ముందు ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదు. సీమలో సమీకరణాలు మారబోతున్నాయి. జనసేన, టీడీపీల పొత్తు అందుకు కారణం కాబోతోంది. 2019లో మూడు సీట్లతో సరిపెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేయలేం. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం సీమలో వైసీపీకి కలిసొచ్చింది. చాలా నియోజకర్గాల్లో ఓట్లు చీలడంతో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. కడప జిల్లాల్లోని మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, జమ్మలమడుగు, కడప నియోజక వర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సత్తా జనసేనకు ఉంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే వైసీపీ కోటకు బీటలు వారే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లాలో కూడ సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రజారాజ్యం నుంచి చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు. చాలా నియోజక వర్గాల్లో ప్రభావవంతమైన ఓటు బ్యాంకు జనసేనకు ఉంది. అనంతపురం జిల్లాలో కూడ టీడీపీ, జనసేన పొత్తు బలమైన ప్రభావం చూపుతుంది. ఇక్కడ టీడీపీ బలానికి జనసేన తోడైతే ఇక తిరుగు ఉండదు. ఒక్క కర్నూలు మినహా మిగిలిన మూడు జిల్లాల్లో జనసేన ప్రభావం గణనీయంగా ఉంటుంది. టీడీపీకి జనసేన ఓటు బ్యాంకు కలిస్తే సీమలో జగన్ ఆటలు సాగవు.