మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం
1 min readపల్లెవెలుగు, కర్నూలు ;
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కర్నూలు నగర పాలక అధికారులు, సిబ్బంది చురుగ్గా సమన్వయంతో అన్ని ముందస్తు ఏర్పాట్ల పనిలో నిమగ్నమయ్యారు. ఈమేరకు గురువారం స్థానిక పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య నగర పాలక పాఠశాలలో మునిసిపల్ అధికారులు నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ తో పాటు ఎన్నికల ఆర్వోలు, ఏఆర్వోలకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పర్యవేక్షణలో అధికారులు నగరంలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఒక్కొక్కటి సంచుల్లో భద్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలాజీ ఎన్నికల సామగ్రిని పరిశీలించి పంపిణీ కేంద్రానికి చేరే ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. అప్పగించిన ఎన్నికల విధులను ముందస్తుగా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నగర పాలక ఎన్నికల్లో బాధ్యులైన ఎన్నికల అధికారులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళిని అనుసరించి మాత్రమే విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మున్సిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ స్వయంగా విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని భుజించారు. ప్రతి రోజూ నిర్ధేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు శుచి, శుభ్రంగా, రుచిగా భోజనాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు ఎస్.రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక మేనేజర్ చిన్నారాముడు, సూపరింటెండెంట్ ఇశ్రాయేల్, సీనియర్ అసిస్టెంట్లు రామకృష్ణ, శ్రీదేవి, అధికారులు నాగరాజు, రాజు, ఇంతియాజ్ ఉన్నారు.