వైభవం.. జంబుల పరమేశ్వరి మాత ఉత్సవం
1 min readబండలాగుడు పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన అన్నలదాసు ధరణి వృషభ రాజములు
పల్లెవెలుగు, రుద్రవరం; మండల కేంద్రం రుద్రవరం సమీపంలోని నల్లమల అటవీ తీర ప్రాంతంలో కొలువైన శ్రీ జంబుల పరమేశ్వరి మాత కు శుక్రవారం భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. జంబుల పరమేశ్వరి మాత ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఇంటి దైవంగా భావించే భక్తులు అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా రుద్రవరం గ్రామం తో పాటు సమీప గ్రామాలు ఆళ్లగడ్డ నంద్యాల కడప జిల్లా ప్రకాశం జిల్లాల లోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ జంబుల పరమేశ్వరి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించగా గ్రామ ప్రజలు అమ్మవారి గ్రామోత్సవం కనుల విందుగా తిలకించారు.
* బండలాగుడులో ప్రథమం ..అన్నలదాసు ధరణి వృషభాలు
శ్రీ జంబుల పరమేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా కమిటీ నిర్వాహకులు శుక్రవారం వృషభ రాజములకు బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల నందు రుద్రవరం గ్రామం తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన 11 జతల వృషభ రాజములు పాల్గొన్నాయి. ఇందులో రుద్రవరం గ్రామానికి చెందిన అన్నలదాసు ధరణి వృషభ రాజములు 3 వేల అడుగులు బండను లాగి మొదటి స్థానంలో నిలవగా మొదటి బహుమతి గా లింగం వెంకట రంగనాయకులు శెట్టి రుద్రవరం 20 తులాల వెండి బహుకరించారు. రెండవ స్థానంలో నిలిచిన కడప జిల్లా పెద్ద చాపాడు గ్రామానికి చెందిన మల్కి షాబ్ గారి జమాల్ బాషా వృషభ రాజములకు వడ్డె రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి రుద్రవరం 15 తులాల వెండి బహుకరించారు. మూడవ స్థానంలో నిలిచిన కడప జిల్లా చెన్నూరు కు చెందిన వెంకట చలపతి వృషభ రాజములకు దేవగుడి జాకీర్ హుస్సేన్ అండ్ బ్రదర్స్ రుద్రవరం 10 తులాల వెండి ని బహూకరించారు. నాలుగవ స్థానంలో నిలిచిన రుద్రవరం గ్రామానికి చెందిన బండారు ధరణీ వృషభ రాజములకు కొండ బోయిన వెంకటరమణ అండ్ కుమారులు రుద్రవరం 6 తులాల వెండి ని బహుకరించారు. ఐదవ స్థానంలో నిలిచిన సిరివెళ్ల మండలం గోపవరం గ్రామానికి చెందిన గుమ్మా వీరయ్య వృషభ రాజములకు 5 తులాల వెండి ని ముత్తలూరు గ్రామానికి చెందిన వెల్డింగ్ శంకర్ బహూకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కమిటీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
బండను లాగుతున్న వృషభ రాజములు