రిడ్జ్ పాఠశాలలో 16 వ జాతీయ జూనియర్ రోల్ బాల్ పోటీలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమకు తలమానికమైన కర్నూలు నగరంలో రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో మొట్టమొదటిసారిగా 16వ జాతీయ జూనియర్ రోల్ బాల్ కప్ ప్రారంభమైనది. స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాల ఆవరణం ఈ కార్యక్రమానికి వేదిక అయినది.ఆర్బీఎఫ్ఐ జాతి ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు అయిన బిజెపి నాయకులు జి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించబడుచున్నవి. జనవరి 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం 11వ తేదీ సాయంకాలం ముగింపు సభ తో పూర్తి కానున్నది. 9 వ తేదీ ఉదయం జరిగినటువంటి ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిథిగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ జి పుల్లయ్య , శ్రీ నగరూరి రాఘవేంద్ర , చంద్రమౌళి మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆర్బీఎఫ్ఐ శిక్షకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.దేశంలోని నలుమూలల నుండి 20 రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 640 మంది క్రీడాకారులు ఈ పోటీలలో తలపడనున్నారు. సుదూర రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఝార్ఖండ్ , ఒరిస్సా, మేఘాలయ వంటి రాష్ట్రాల నుండి కూడా క్రీడాకారులు పాల్గొనడం ఈ కార్యక్రమం యొక్క విశేషం. ప్రారంభ ఉపన్యాసంలో ముఖ్య అతిథి అయిన శ్రీ జి పుల్లయ్య మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులకు, క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ వారి క్రీడా స్ఫూర్తిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేశారు. రిడ్జ్ పాఠశాల యాజమాన్యంగా 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషాన్ని మరియు స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. శ్రీ నగరూరు రాఘవేంద్రరావు మాట్లాడుతూ కర్నూలులో జాతీయస్థాయి క్రీడ నిర్వహించడం చాలా గర్వకారణం అని తెలియజేశారు. జాతియ ఉపాధ్యక్షులు చంద్రమౌళి 16వ జూనియర్ రోల్ బాల్ క్రీడలు ప్రారంభమైనట్లుగా అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం రాష్ట్రాల వారీగా క్రీడాకారులు కవాతు నిర్వహించి తాము క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రిడ్జ్ పాఠశాల సీ.ఈ.ఓ గోపినాథ్ , కో సి.ఈ.ఓ సౌమ్య గోపినాథ్ , పాఠశాల డీన్ రాజేoద్రన్ , ప్రిన్సిపల్ రాజ్ కమల్, నిర్వాహకులు సునీల్ రెడ్డి , మంజునాథ్ , అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.