అ‘పూర్వ’ సమ్మేళనం
1 min read- 22 ఏళ్ల తరువాత కలిసిన స్నేహబంధం
- అప్పటి గురువులను సన్మానించిన పదో తరగతి విద్యార్థులు
- జ్ఞాపకాలు నెమరువేసుకున్న 2002వ బ్యాచ్ విద్యార్థులు
ఆదోని, పల్లెవెలుగు: చింతచెట్టు కింద చదివిన చదువులు… తరగతి గదిలో చేసిన అల్లర్లు…. పాఠశాల ఆవరణలో పడిన గొడవలు…. మైదానంలో ఆడిన ఆటలు…. గురువుల బెత్తం దెబ్బలు…. ఇలా ఆహ్లాదం.. ఆనందంతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఒక్కరోజు సంతోషంలో మునిగి తేలారు ఆర్ సీఎం స్కూల్ 2002వ పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు. 22 ఏళ్ల స్నేహబంధం నెమరేసుకున్నారు. ఆదివారం ఆదోని పట్టణంలోని ఆర్సీఎం స్కూల్లో గెట్ టు గేదర్ నిర్వహించారు. తాము చదివిన పాఠశాలకు ఎంతో కొంత సాయం చేయాలన్న తలంపుతో…. రూ. 30 వేలు విలువ చేసే క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సీఎం స్కూల్ రెవ ఫాదర్ జార్జి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే లక్ష్యం వైపు అడుగులు వేసిన ప్రతిఒక్కరూ… జీవితంలో స్థిరపడతారన్నారు. ఇక్కడ చదివిన ప్రతిఒక్కరూ ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డారని, ఇది గురువుల విజయంగా భావిస్తున్నానన్నారు. అనంతరం రెవ ఫాదర్ జాన్ డేవిడ్ మాట్లాడుతూ విద్యార్థులను దేశానికి.. సమాజానికి సేవ చేసే సైనికులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. అందులో భాగంగానే ఇక్కడ చదివిన పిల్లలు ఎందరో సైనికులుగా.. పోలీసులుగా, వైద్యులుగా సేవ చేస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు. ఆ తరువాత విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేశవయ్య, రిటైర్డు హెచ్ఎం ఎల్.కె. చిన్నప్ప, రిటైర్డు టీచర్ శాంతగ్రేస్, ప్రతాప్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, ఎ. జోజి రెడ్డి, ఎస్. జోజి రెడ్డి, మారెన్న, శ్యాముయేల్, థామస్, వర ప్రసాద్ తదితరులను శాలువా కప్పి.. పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో, విద్యార్థులు శివ, ఆనంద్, యుగంధర్, ఛార్లెస్ తదితరులు పాల్గొన్నారు.