స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు పటిష్టమైన భద్రత ఉండాలి
1 min readజిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్ట్రాంగ్ రూముల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పేర్కొన్నారు.గురువారం రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎమ్ యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లకు సంబంధించిన సిసి కెమెరాల లైవ్ ఫీడ్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్, పాణ్యం ఆర్వో నారపు రెడ్డి మౌర్య తో కలిసి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం లో ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను, సెక్యూరిటీ, కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.. కంట్రోల్ రూమ్ లో పార్లమెంట్, అసెంబ్లీ కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లు 24 గంటలు స్క్రీన్ లలో డిస్ప్లే అవుతూ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.. భద్రతా చర్యలు పటిష్ఠంగా ఉండాలని, పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా వుండాలన్నారు. కంట్రోల్ రూం కి షిఫ్ట్ ల ప్రకారం నియమించిన రెవెన్యూ సిబ్బంది వివరాలను పోలీస్ అధికారులకు అందచేయాలని డిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.రాయలసీమ యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత దృష్ట్యా విధులు నిర్వహిస్తున్న కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, స్థానిక పోలీస్ కు త్రాగు నీరు, భోజన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని డిఆర్ఓ, టీడ్కో ఎస్ఈ లను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్, పాణ్యం రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావు,కుడా వైస్ చైర్మన్, వెబ్ కాస్టింగ్ నోడల్ అధికారి ప్రతాప్ రెడ్డి, టీడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఎమ్మిగనూరు రిటర్నింగ్ అధికారి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.