ఓటరు నమోదు శిబిరాలకు 284 దరఖాస్తులు
1 min readముగిసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు
నగరపాలక కమిషనర్, ఆర్వో ఎస్.రవీంద్ర బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం కర్నూలు నియోజకవర్గంలోని 258 పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలకు 284 దరఖాస్తులు వచ్చినట్లు నగరపాలక కమిషనర్, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.రవీంద్ర బాబు అన్నారు. ఆదివారం కెవిఆర్ కళాశాల, మున్సిపల్ ప్రైమరీ స్కూల్, మున్సిపల్ ఉర్దూ ప్రైమరీ స్కూల్, రోజ స్ట్రీట్ ప్రకాశ్ నగర్ మున్సిపల్ హైస్కూల్, నరసింహా రెడ్డి నగర్, కప్పల్ నగర్, లేబర్ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను కమిషనర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ సమ్మరీ రివిజన్-2025 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 258 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయగా, కొత్త ఓటు నమోదుకు సంబంధించి (ఫాం-6) 73, చనిపోయిన, మరో పోలింగ్ కేంద్రానికి ఓటు మార్చు వంటి కారణాలతో ఓటు తొలగింపునకు సంబంధించి (ఫాం-7) 62, పేరు, చిరునామా తదితర వివరాల మార్పునకు సంబంధించి (ఫాం-8) 149 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొత్త ఓటు నమోదు, వివరాల మార్పు, తొలగింపునకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా స్థానిక బిఎల్వోల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఇ.వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ డబ్లూ.ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.