ఉచిత గ్యాస్ సిలండర్ లబ్ధిదారులకు రూ.3.51 కోట్ల రూ. సబ్సిడీ జమ
1 min readఅర్హులైన ప్రతీ ఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలండర్ అందుతుంది, ఆందోళన చెందవద్దు
దీపం -2 పధకం వివరాలను పాత్రికేయుల సమావేశంలో తెలియజేసిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి
సమస్య ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి, కలెక్టర్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయవచ్చు
ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు 2025 వరకు అవకాశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని దీపం-2 ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం ఇంతవరకు 42 వేల 320 మంది లబ్దిదారులకు 3.51 కోట్ల రూపాయలు సబ్సిడీగా అందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గురువారం సాయంత్రం దీపం-2 పధకం అమలుపై పాత్రికేయుల సమావేశంలో వివరాలను తెలియజేసారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ట్రైబల్ ప్యాకేజి, దీపం -1, జనరల్, సీఎస్.ఆర్., పీ.ఎం. ఉజ్వల లకు చెందిన వారు ఉచిత ఎల్పీజీ సిలండర్లు పొందేందుకు అర్హులన్నారు. వీరికి ఉచిత గ్యాస్ సిలెండరుకు రైస్ (తెల్లరంగు) కార్డు, బ్యాంకు అకౌంట్ తో ఆధార్ అనుసంధానం, వినియోగంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ ఉండాలన్నారు. జిల్లాలో 6 లక్షల 31 వేల 044 రైస్ కార్డులు ఉన్నాయని, వాటిలో ఎల్పీజీ డేటా తో 4 లక్షల 75 వేల 723 గ్యాస్ కనెక్షన్లు సరిపోలుతున్నాయన్నారు. వీటిలో 4వ తేదీ వరకు 96 వేల 628 మంది ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం బుకింగ్ చేసుకోగా, 69 వేల 904 మంది లబ్దిదారులకు గ్యాస్ సిలండర్ అందించడం జరిగిందన్నారు. వీరిలో 42 వేల 320 మంది లబ్దిదారులకు సబ్సిడీ వారి ఖాతాలో జమ అయిందని, మిగిలినవారికి రెండురోజుల్లో జమ అవుతుందన్నారు. ఎప్పుడూ లేనంతగా అతి కొద్దీ సమయంలోనే 96 వేల మందికి పైగా ఉచిత గ్యాస్ సిలండర్ కోసం బుక్ చేసుకున్నారన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మార్చ్, 2025 వరకు ఒక ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉందని, చాలా మంది లబ్ధిదారులు గ్యాస్ సిలండర్ ఖాళీ కాకపోయినప్పటికీ సిలండర్ బుక్ చేసి, డెలివరీ తీసుకోవడం లేదని, జిల్లాలో అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తామని లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, గ్యాస్ సిలండర్ ఖాళీ ఐన తర్వాతే ఉచిత గ్యాస్ బుక్ చేసుకోవచ్చని జేసీ చెప్పారు. గ్యాస్ సిలండర్ డెలివరీ ఇచ్చిన తరవాత రెండు రోజులకు సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో జమ ఆవుతుందన్నారు. ఈ -కేవైసీ చేయించుకునేందుకు ఎవరూ గ్యాస్ ఏజెన్సీ ల వద్దకు రానవసరం లేదని, సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ స్వయంగా గ్యాస్ వినియోగదారుల ఇంటివద్దకు వెళ్లి ఉచితంగానే ఈ-కె వైసీ చేస్తారన్నారు. వినియోగదారులు ఏదైనా సమస్య ఉంటె 1967 టోల్ ఫ్రీ నెంబర్ లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) ఆన్లైన్ లో ఉచిత గ్యాస్ సిలండర్ల సమస్యలపై ప్రత్యేకంగా ఫిర్యాదును నమోదు చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. రైస్ కార్డు దారులు తమ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ వినియోగంలో లేకపోతే వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి ఉచిత గ్యాస్ సిలండర్ పొందవచ్చని జేసీ ధాత్రిరెడ్డి తెలియజేసారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. సత్యనారాయణరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.