ఘనంగా 71వ అఖిలభారత సహకార వారోత్సవాలు
1 min readజిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో కార్యక్రమాలు
పతాక ఆవిష్కరణ చేసిన జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి
సహకార బ్యాంకుల సమిష్టి కృషితో రైతులకు సేవలు అందించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సహకార పతాక ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా జెసి పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వున్న సన్న చిన్నకారు రైతులకు అందుబాటులో ఉంటూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, సహకార సంఘాలు విస్తృత సేవలు అందిస్తున్నాయన్నారు. రైతుల, సభ్యుల అవసరాలను గుర్తించి సకాలములో సేవలు అందుబాటులోనికి తీసుకొని రావాలని పి.ఎ.సి.ఎస్.లు కంప్యూటరీకరణ సకాలములో పూర్తి చేయాలన్నారు. జిల్లా సహాకార కేంద్ర బ్యాంకు, పి.ఎ.సి.ఎస్.లు సమన్వయంతో సిబ్బంది అందరూ సమిష్టికృషితో పనిచేసి ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకునకు పూర్వ వైభవమును తీసుకొని రావాలన్నారు. జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని సహకార సంఘాల సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ అధికారులు సమిష్టిగా పనిచేస్తామని సంఘాల కంప్యూటరీకరణ విషయంలోగాని పరపతేతర వ్యాపారం చేయుటలోను జిల్లా లోని ప్రతీ సహకార సంఘమునకు, కామన్ సర్వీసు కేంద్రాలుగా గుర్తింపు తీసుకొని వచ్చామని తద్వారా రైతులకు పి.ఎ.సి.ఎస్.ల ద్వారా బహుళ సేవలు అందించి ఏలూరు జిల్లాను ప్రగతి పధంలో తీసుకొనిరాగలమని తెలిపారు. డి.సి.సి.బి. సి.ఇ.ఓ. తిలక్ నారా తమ బ్యాంకు యొక్క ఆర్ధిక గణాంకాలు, చేబట్టబోవు ప్రణాళికలను బ్యాంకు అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యలను గురించి చెబుతూ బ్యాంకు సిబ్బంది అందరూ కలిసికట్టుగా బాధ్యతా యుతంగా పనిచేస్తామన్నారు. ఆర్.శ్రీనివాసరావు, ఫ్యాకల్టీ,సహకార వారోత్సవాల ఇన్ చార్జ్ మాట్లాడుతూ సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను గురించి ప్రధానాంశముగా ‘వికసిత భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ‘ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సహకార వ్యవస్థ ద్వారా స్థిరమైన జీవనోపాధి సృష్టించుటకు వారి ఆర్ధిక అభివృద్ధికి కీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్బంగా బ్యాంకు ఉద్యోగులు, సహకార గీతాలాపన చేసి బ్యాంకు సిబ్బందితో సహకార ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు, సిబ్బంది, పి.ఎ.సి.ఎస్.ల సిబ్బంది ఎంతో ఉత్సాహంలో పాల్గొన్నందుకు బ్యాంకు సి.ఇ.ఓ. కృతజ్ఞతలు తెలియజేసారు.