ఘనంగా ‘‘ఆర్యూ ”లో 75వ రాజ్యాంగ దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన దేశాన్ని సమిష్టిగా నిలిపే శక్తిగా భారతరాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులను స్మరించుకోవలసిన అవసరముందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఆ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో వర్సిటీ పాతలైబ్రరీఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంవద్ద నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి వి.సి. ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్లో తలమానికంగా నిలిచే భారత రాజ్యాగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. వర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్ నిలువెత్తు విగ్రహ ప్రతిష్టాపనకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వి.సి. ప్రకటించారు. సమాజంలోని అన్నివర్గాలకు సమన్యాయం జరగాలన్నదే డాక్టర్ అంబేద్కర్ ఆశయమని వర్సిటీ రిజిస్ట్రార్ నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే దానికి మూలకారణం రాజ్యాంగ రూపకర్తల దురదృష్టేనని వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి నివాళులర్పించారు. మనదేశంతోపాటు స్వాతంత్ర్యం పొందిన వివిధ దేశాలు సైనికపాలనలోకి, నియంతల చేతుల్లోకి జారిపోతుంటే మనదేశంమాత్రం ప్రజాస్వామికంగా ప్రగతిపథంలో పురోగమించడానికి కారణం రాజ్యాంగమేనని వర్సిటీ డీస్ అఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి.వి. సుందరానంద్ వివరించారు. అలాంటి రాజ్యాంగ రచనాసంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబాసాహెబ్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర భారతరూపశిల్పి అని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని వివిధ విభాగాల ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.