బొగ్గు కొరత ప్రభావం..కడప థర్మల్పవర్ప్లాంట్లో తగ్గిన విద్యదుత్పత్తి!
1 min readపల్లెవెలుగువెబ్, కడప: దేశంలో బొగ్గు కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా విద్యుత్ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరిస్తోంది. కడప రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా కేవలం నాలుగు యూనిట్ల ద్వారా మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన రెండు యూనిట్లను అధికారులు నిలిపివేశారు. నాలుగు యూనిట్ల నుంచి 670మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తున్నారు. కడప థర్మల్ పవర్ ప్లాంట్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఇందులో 210మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లు 5, 600మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ ఒకటి చొప్పున్నాయి. అయితే మొత్తం 1650మెగావాట్ల సామర్థ్యం గల కడప పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతం బొగ్గు కొరత నేపథ్యంలో నాలుగు యూనిట్ల నుంచి కేవలం 670మెగాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని 5010మెగావాట్ల సామర్థ్యం గల అయిదు థర్మల్ పవర్ప్లాట్లకు 20ర్యాక్స్ బొగ్గు సరఫరా చేయాలని ఏపీ కేంద్రానికి కోరింది. అయితే బొగ్గు ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో విద్యుదుత్పాదక రేటు గణనీయంగా తగ్గుతోంది. ఈ క్రమంలో విద్యుత్ యూనిట్ ధర రూ.4.50 నుంచి రూ.20లకు పెరిందని ఏపీ పేర్కొంటోంది. బొగ్గు కొరత రానున్న వేసవిలో ఎలాంటి సంక్షోభాన్ని తెస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.