కర్నూలులో కళాకారుల పరిస్థితిపై ఆరా తీసిన సింగర్ సునీత
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కళాకారుల పరిస్థితిపై ప్రముఖ నేపథ్య గాయని సునీత ఆరా తీశారు. కరోనా వల్ల ఏడాదిన్నరకుపైగా ఎలాంటి ప్రదర్శనలు లేకపోవడంతో ఇక్కడి వారి పరిస్థితి ఎలా ఉందని ఆమె అడిగి తెలుసుకున్నారు. నగరంలోని గాంధీనగర్ ఎదురుగా ఏర్పాటు చేసిన ‘‘కేక్ వాలా’’ ఓ బేకరీ ప్రారంభోత్సవానికి సింగర్ సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమాన్ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెనికలపాటి హనుమంతరావు చౌదరి సాదరస్వాగతం పలికారు. సునీతకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుల గురించి ఆమె అడుగగా ఏడాదిన్నరగా ఎలాంటి ప్రదర్శనలు లేక కళాకారుల గొంతులు మూగబోయాయని హనుమంతరావు చౌదరి తెలిపారు. చాలా మంది కరోనా కంటే.. ఆర్ధిక బాధలు భరించలేక.. ఒత్తిళ్లకు గురై చనిపోయారని చెప్పారు. అన్ని రంగాల వారికి అంతో ఇంతో సాయం చేస్తున్న ప్రభుత్వం కళాకారులకు ఒక్క పైసా విదల్చలేదని హనుమంతరావుచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. సింగర్ సునీత బదులిస్తూ.. కళాకారులు ఏ ప్రభుత్వాలపై ఆశపెట్టుకోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలన్నారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారనే ఆశ పెట్టకుని నిరాశకు గురికాకుండా సొంతకాళ్లపై నిలదొక్కుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలని సింగర్ సునీత సలహా ఇచ్చారు.