అప్పటి దాక రైతుల పై దోపిడీ ఆగదు : బీజేపీ ఎంపీ ట్వీట్
1 min readపల్లెవెలుగు వెబ్: కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ లభించనంత వరకు మండీల్లో రైతులు దోపిడీకి గురవుతూనే ఉంటారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదిగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అంశాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వ విధానాలపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు చట్టాల విషయంలో పునరాలోచన చేయాలని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ లో ఓ రైతు పంటకు నిప్పు పెట్టిన వీడియో ట్విట్టర్ లో షేర్ చేసిన వరుణ్ గాంధీ.. రైతు తన పంటకు తానే నిప్పు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం అంటూ వ్యాఖ్యానించారు. మన వ్యవస్థ ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. అన్నం పెట్టేవారిని కాపాడలేకపోవడం మనందరి వైఫల్యం అని చెప్పారు. దీని పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని వ్యాఖ్యానించారు.