కేసీ కెనాల్ లో పడి రైతు గల్లంతు..
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన కురువ వెంకటస్వామి (55) ప్రమాదవశాత్తు కేసి కాలువలో జారి పడి గల్లంతు అయిన ఘటన బ్రహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి జిల్లెలపాడు గ్రామ సమీపంలో ఉన్న వరి పొలంలో పొగాకు నుసిని పిచికారీ చేయడానికి మనమడు తో కలిసి వెళ్ళాడు. పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణంలో కాలు చేతులు కడుక్కోవటానికి కేసీ కెనాల్ లో దిగి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. మనుమడు తాతను కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఫలించలేదు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
గ్రామస్తులు, సమీపంలోని రైతులు హుటాహుటిన కేసి కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైనా వ్యక్తి ఆచూకి లభించలేదు.గల్లంతైన వ్యక్తి వెంకటస్వామి గతంలో పగిడ్యాల మండలం నెహ్రూనగర్ సమీపంలో కృష్ణానదిలో జరిగిన పుట్టి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు తెలిపారు. అలాంటి వ్యక్తి కేసి కాలువలో గల్లంతు కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.