నందికొట్కూరు 10వ వార్డు ఓటరు ఎటు వైపు..?
1 min read– ప్రచారం ముగిసింది.. అభ్యర్థులలో టెన్షన్ మొదలైంది..
– ఓటర్లకు భారీగా తాయిలాల ఎరా..?
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ 10వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా.. ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్‌లో ఉంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
భారీగా తాయిలాలు..
ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ 10వ వార్డులో మొత్తం ఓటర్లు 986 మంది ఉండగా 498 మంది మహిళా ఓటర్లు, 488మంది పురుషుల ఓటరులు ఉన్నారు. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటరులను తాయిలాలతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు.ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో టిడిపి నాయకులు ఉన్నారు. టిడిపిని ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని వైసీపీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. మరోవైపు నందికొట్కూరు మున్సిపాలిటీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి.10వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది పోటీ రసవత్తరంగా మారింది. ఓటరు నాడి అంతుపట్టడం లేదు. శనివారంతో ప్రచారం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీల మధ్య గెలుపు ఓటముల తీవ్రత పెరుగుతోంది. అయినా ఓటరు నాడి అంతపట్టడం లేదు.ఓటరు స్థానికుల వైపున ఉన్నారా లేక స్థానికేతరుల వైపున నిలుస్తారో వేచి చూడాల్సిందే.