కోర్టుల విచారణను తప్పించుకునేందుకే అలా చేశారు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మూడు రాజధానులపై సీఎం జగన్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టుల విచారణను తప్పించుకునేందుకే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని అంగీకరించారని.. అయితే ఇప్పుడు మాట తప్పారని వీర్రాజు మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. సీమ అభివృద్ధిపై జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం గుంటూరుకు ఎయిమ్స్, తిరుపతిలో ఐఐఎం.. కర్నూలు, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విశాఖలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిందని.. వైసీపీ సర్కార్ గత రెండున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. మరోపక్క వ్యక్తిగత ధూషణలు, బండబూతులు, అబద్ధాల కోసం శాసనసభను వినియోగించుకుంటున్నారని విమర్శించారు. సభను సజావుగా నడిపించే విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చొరవ తీసుకోవాలని సోము వీర్రాజు సూచించారు.