భారీ హెచ్చుతగ్గుల నడుమ.. లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ , నిప్టీ లాభంలో ముగియగా.. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. కరోన వైరస్ కొత్త వేరియంట్ కేసులు పలు దేశాల్లో నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చాలా దేశాలు ఇప్పటికే విదేశీ రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను కూడ రద్దు చేశారు. ఈ వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో సూచీలు భారీ ఎత్తున కరెక్షన్ కు గురయ్యాయి. దాదాపు 8 శాతం వరకూ సూచీల్లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. వేరియంట్ వ్యాప్తి వేగం, లక్షణాల తీవ్రత లాంటి అంశాలపై పరిశోధన చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు ఈ వేరియంట్ అంత ప్రమాదకరమేమి కాదన్నవార్తలు కూడ వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ఇంటి వద్దే వారికి చికిత్స అందిస్తున్నట్టు దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ కమిటీ మెంబర్ ఎంజలీన కోయెట్జీ ఓ ఇంగ్లీష్ వార్త సంస్థకు వెల్లడించారు. ఇలాంటి కొన్ని పాజిటివ్ న్యూస్ తో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గుల మధ్య లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 153 పాయింట్ల లాభంతో 57260 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17053 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 35976 వద్ద క్లోజ్ అయ్యాయి.