రాయలసీమ పద్మశాలీయుల 7వ మహాసభ విజయవంతం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాయలసీమ ప్రాంత పద్మశాలీయుల 7వ మహాసభ విజయవంతమైంది. ఆదివారం కర్నూలు నగరంలోని దేవి ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో సంఘం జిల్లా కన్వీనర్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన మహాసభలో ముఖ్య అతిథులు పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతలు ఏకతాటిపై వచ్చి… రాజకీయంగా రాణిస్తున్నారన్నారు. చేనేతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో రాజకీయంగా రాణించే వారికే పద్మశాలీయుల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్ల కేటాయింపులో పద్మశాలీయులకు అధికంగా కేటాయించాలని, సత్తాచాటి గెలిపించుకుంటామన్నారు.
అనంతరం రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంకతి లక్ష్మినారాయణతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, ఎల్. రమణ, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షులు శ్రీధర్ సుంకూర్వార్, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమనపల్లె లక్ష్మిదేవి, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి నాగమళ్ల శంకర్, పోలంకి వరదరాజులు, పద్మశాలీ సంఘం కడప జిల్లా అధ్యక్షులు శిలివేరు దశరథ రామయ్య, కార్యదర్శి చెన్నా వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.