బిడ్డల ఆకలి కోసం.. తల్లిదండ్రుల కిడ్నీల అమ్మకం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆప్ఘాన్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు. తాలిబన్ల హస్తగతమైన నాటి నుంచి నేటి వరకు అప్ఘన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. దుర్భర పరిస్థితుల్లో ప్రజలు శరీరంలోని అవయవాలను అమ్మేందుకు వెనుకాడటం లేదు. ఆర్థిక సంక్షోభం కారణంగా చాలా మంది ప్రజలు కిడ్నీలు అమ్మేందుకు ముందుకు వస్తున్నారని స్థానిక వైద్యులు చెబుతున్నారు. తాను బయటికి వెళ్లి డబ్బు అడుక్కోలేనని, అందుకే ఆస్పత్రికి వెళ్లి తన కిడ్నీ లక్షా 69 వేలకు అమ్మేసినట్టు గులాం హజ్రత్ అనే వ్యక్తి తెలిపారు. ఆరోగ్యం కంటే కుటుంబ పోషణకే ఆప్ఘనిస్థాన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్థానిక వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆప్ఘనిస్థాన్ లో ఆకలి సునామీ రాబోతోందని ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రపంచ దేశాలన్నీ తక్షణమే రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ఆప్ఘన్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.