న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల నిరసన ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ గ్రామ సహాయకుల సంఘం జిల్లా నాయకులు రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పత్తికొండలో వీఆర్ఏలు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు స్తంభాల కూడలి వద్ద జరిగిన ధర్నాలో రెవెన్యూ గ్రామ సహాయకుల సంఘం నాయకులు మాట్లాడుతూ, అర్హులైన వీఆర్ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. చాలీచాలని జీతాలతో బతుకులు వెళ్ళదీస్తున్న తమకు కనీస వసతులను కల్పించాలని కోరారు. ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వీఆర్ఏలకు 21 వేల జీతం ఇవ్వాలన్నారు. 11వ పిఆర్సి వీఆర్ఏలకు వర్తింపచేయాలని కోరారు. వీఆర్ఏ నామినిలను రెగ్యులర్ చేయాలని కోరారు. మొదట వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక ఇన్చార్జి తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వీర శేఖర్, గోపాలు, దస్తగిరి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.