వాలంటీర్ల వ్యవస్థ..దేశానికే ఆదర్శం….: కలెక్టర్ గిరీష
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్…ఐ ఏ ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని సుండుపల్లెలో వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిల చేతుల మీదుగా సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలనుఅందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ ఐ ఏ ఎస్. మాట్లాడుతూ… గతంలో ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారిని అయినా కూడా అధికారులు రిటైర్ కావాలే తప్ప అర్హులకు పథకాలు అందేవి కావన్నారు. నేడు ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వారి ముంగిటకు చేర్చడం జరుగుతోందన్నారు. అధికారులే ప్రజల వద్దకు వెళ్లాలి అనే కాన్సెప్ట్ తో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడంలో వాలంటీర్ల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వర్యులు వారికి సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర పురస్కారాలు అందజేయడం నేడు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజన్నారు. సంక్షేమ పథకాలు వంద శాతం పేదలకు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని.. వాలంటీర్లకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఒక్కరు కూడా అర్హులు మిస్ కాకుండా పారదర్శకంగా అందరికీ పథకాలు అందాలన్నారు. రాబోయే రోజులలో అన్నమయ్య జిల్లా విద్య, వైద్య, పారిశ్రామిక వంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అనంతరం రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ… నేడు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేయడం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ…. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పేదల పక్షపాతిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని నేడు ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తెస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా సుండుపల్లి మండలంలో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ అందజేయడంలో కృషి చేసిన 220 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, 5 మందికి సేవ రత్న, ఇద్దరికీ సేవా వజ్ర పురస్కారాలు ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్ డి ఓ కోదండరామిరెడ్డి, ఎంపీపీ రాజమ్మ, జడ్పిటిసి ఇస్మాయిల్, తహసీల్దార్ శ్రీవాణి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.