అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరెస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : రూ.25 వేలు లంచం తీసుకున్నారనే అభియోగంపై విజయవాడలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) పున్నమల్లి బాపూజీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. లేబర్ లైసెన్స్ జారీచేయాలని కోరుతూ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బాపూజీ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు విశాఖలోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు పథకం ప్రకారం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో మాటు వేసి బాధితుడు నుంచి బాపూజీ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాపూజీపై కేసు నమోదుచేసి రిమాండ్ నిమిత్తం బుధవారం విశాఖలోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్టు అధికారులు పేర్కొన్నారు.