కేంద్రానికి పోటీగా టీఆర్ఎస్ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కు పోటీగా సీఎం కేసీఆర్ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు ఏడు రోజులు.. తర్వాత ఏడు రోజులు.. మొత్తం 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలు నిర్వహించనున్నట్టు శనివారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల, పోచంపెల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్లివ్వాలని అధికారులను ఆదేశించారు. జెండాల తయారీ సహా ప్రచార కార్యక్రమాల కోసం ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.