సవాలుగా మారిన వర్షాలు.. ఐఎండీ అంచనాలు తప్పుతున్నాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : వాతావరణంలో గత కొద్దికాలంగా చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగిపోయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇది వాతావరణ నిపుణులకు సవాలుగా మారిందని, తీవ్ర పరిణామాలను కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వాతావరణంలో పెరిగిన అనిశ్చితి వల్ల ఉష్ణ ప్రసరణ చర్య, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు పెరిగిపోయాయన్నారు. అందుకే మనదేశంలో వర్షాకాలం తరచుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరిగిపోయిందని, తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే రోజుల సంఖ్య తగ్గిపోయిందని వివరించారు. అల్పపీడన వ్యవస్థ ఉన్నప్పుడు వర్షపాతం మరింత తీవ్రంగా ఉంటోందన్నారు. భారత్ సహా ఉష్ణమండల ప్రాంతంలో ఈ ధోరణి తరచుగా కనిపిస్తోందని తెలిపారు. అందువల్ల తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చే సేందుకు ప్రణాళికలు రూపొందించామని, ప్రస్తుతం ఉన్న 34 రాడార్లను 2025 సంవత్సరం నాటికి 67కు పెంచాలని నిర్ణయించామని చెప్పారు.