‘రెమె డెసివర్’ను బ్లాక్లో విక్రయిస్తే.. కఠిన చర్యలు
1 min read– కడప ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్
పల్లెవెలుగు వెబ్, కడప : జిల్లాలో రెమె డెసివిర్ ఇంజక్షన్ లు బ్లాక్ లో లేదా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు యాజమాన్యం, మెడికల్ ఏజెన్సీలు రెమెడెసివర్ ఇంజక్షన్లును బ్లాక్లో విక్రయిస్తే… ప్రజలు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించి… సామాజిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని జిల్లా ఎస్.పి కోరారు. మాస్కు లేకుండా తిరిగే ప్రజలు, వాహనదారులపై జరిమానా విధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఈ నేపథ్యంలో జిల్లాలోని పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ప్రజలు గుమిగూడకుండా పోలీసు పికెట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల క్షేమం కోసం పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, కోవిడ్ నిబంధనల అమలులో, కర్ఫ్యూ అమలులో ప్రజలు, దుకాణ దారులు పోలీసు శాఖ కు సహకరించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ కోరారు.