26 ఏళ్ల తరువాత… అ ‘పూర్వ’ సమ్మేళనం..
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల (ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ గర్ల్స్, బి క్యాంప్, కర్నూలు ) లో 1995-1996 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్తినులు శనివారం తాము చదివిన పాఠశాలలో 26 సంవత్సరాల తర్వాత తమ పూర్వజ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.1990 నుండి 1996 వరకు అందరూ కలిసి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు ఒకే చోట హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ప్రస్తుతము చాలామంది విద్యార్థులు ప్రభుత్వ , ప్రైవేటు రంగంలో స్థిరపడినవారు అందరూ కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థినులు అందరూ మాట్లాడుతూ మేము చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను , చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా , సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటు ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగ గడిపారు. చివరలో పూర్వ విద్యార్థినుల ఉద్దేశించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో స్థిరపడిన పుష్పలత మాట్లాడుతూ 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. జరిగిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థినుల సమావేశానికి వచ్చిన ప్రతి స్నేహితురాలిని సత్కరించి , జ్ఞాపిక మెమొంటోను అందజేశారు. మరొకసారి వీలైతే త్వరలోనే మనకు చదువు చెప్పిన గురువులతో ఒక సమావేశము ఏర్పాటు చేసి మన గురువులను సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ప్రస్తుతము మనం చదివిన ఈ పాఠశాలను గత కొద్ది సంవత్సరాల క్రితం జగన్నాధ గట్టు పైకి మార్చడం జరిగిందన్నారు. దాదాపుగా 11 కోట్ల రూపాయలను వెచ్చించి మన పాఠశాలకు సొంత భవనాలను కట్టించడం జరిగిందని , జగన్నాధ గట్టు పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన పాఠశాల ఉంటుందని ఒకరినొకరు నెమరు వేసుకున్నారు.