“మనగ్రామం” పంటలే మన ఆరోగ్యానికి రక్ష
1 min read– మాజీ ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడు.
పల్లెవెలుగు, వెబ్ విజయవాడ : సమీపంలోని పెనమలూరు గ్రామం వద్ద నిర్వహిస్తున్న “మనగ్రామం” సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని శుక్రవారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందర్శించారు. స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చి సహజసిద్ధమైన సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో పండించిన ఉత్పత్తులతో తయారైన వంటకాలను అందిస్తున్న మువ్వా రామకృష్ణ శ్రీమతి మాధవిలత కుటుంబ సభ్యుల అంకితభావానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ప్రకృతి వంటకాలవైపు ఆకర్షితులు అయ్యేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మనగ్రామం కేంద్రం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులను అందిస్తున్నారని కొన్ని పత్రికలలో చదివి తెలుసుకుని ఈ కేంద్రాన్ని సందర్శించాలనే కోరిక కలిగిందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల దిగుబడి తక్కువగా ఉండడంవలన సహజసిద్ధ ప్రకృతి ఉత్పత్తుల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, వాటిని ప్రత్యేక శ్రద్ధతో పండించవలసి ఉంటుందన్నారు. వ్యవసాయ భూములలో ఎరువులు, క్రిమి సంహారిక మందులను పరిమితికి మించి వాడడంతో భూసారం తగ్గిపోతోందన్నారు. సహజసిద్ధమైన పశువుల పేడతో తిరిగి భూసారాన్ని పెంచి నేలతల్లి పరిరక్షణలో భాగస్వామ్యులం కావాల్సివుందన్నారు. జనాభా పెరగడంతో దురదృష్టవశాత్తు పశుసంపద తగ్గిందన్నారు. పశుసంపద ఉంటే దేశ సంపద పెరుగుతుందని ఈసందర్భంగా మహాత్మగాంధీ వాఖ్యలను గుర్తు చేశారు. ప్రాచీన పద్ధతులు, సాంప్రదాయాలను మనం ఎన్నటికి మర్చిపోకూడదని మన కట్టు బొట్టు భాష యాశ లను గుర్తు చేసుకోవాలన్నారు. పూర్వకాలం నుండి వస్తున్న వారసత్వ సాంప్రదాయలను మనం కాపాడుకోవాలన్నారు. మమ్మీ అనే పిలుపు పెదాల నుండి వస్తుందని, అమ్మ అనే పిలుపు అంతరాల నుండి వస్తుందని పెద్దలు తమ పిల్లలను మమ్మీ డాడీ పిలుపు నుండి అమ్మ నాన్న అనే మదురమైన పలుకులకు అలవాటు పడేలా చేయాలన్నారు. ప్రకృతిని ప్రేమిస్తే అది మనలను ప్రేమిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సుభాష్పాలేకర్ను కేంద్రప్రభుత్వం పద్మఅవార్డుతో సన్మానించడం జరిగిందన్నారు. ఇటీవల కోవిడ్ మహమ్మారి పట్టణ ప్రజల పైనే విజృంభించిందని గ్రామాలలో ప్రజలు ఎక్కువ కష్టపడడం, ప్రకృతి ఉత్పత్తులను తీసుకోవడం వలన వారిలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండి కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కోగలిగారన్నారు. ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన రాగి, సజ్జలు, జొన్నలు,కొర్రలు, ఆరికలు, సాములు, ఊదలు వంటి చిరు దాన్యాలతో తయారు అయిన వంటలపై మక్కువ పెంచుకోవాలనియంవెంకయ్యనాయుడు తెలిపారు. మన గ్రామం నిర్వహకులు మువ్వా రామకృష్ణ మాట్లాడుతూ సేంద్రీయ పద్ధతులలో ఆవు నెయ్యి, ఎద్దుగానుగ నుండి తీసిన పప్పు, కొబ్బరి, వేరుశనగ నూనెలతో తయారు అయిన వంటకాలు, గోఆధారిత షాంపు, ఆగరబత్తులు, గో మూత్రంతో తయారు అయిన మందులు, సున్నిపిండి వంటి సహజసిద్ధమైన ఉత్పత్తులు వినియోగదారులకు ఆందుబాటులో తీసుకువచ్చామని ఆయన, మాజీ ఉపరాష్ట్రపతికి వివరించారు.