PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘డయాబెటిస్​’పై అవగాహన అవసరం…

1 min read

వ్యాయమం.. జాగ్రత్తలు పాటించాల్సిందే..

 సీనియర్​ ఎండో క్రినాలజిస్ట్​  డా. పి. శ్రీనివాసులు,

నవంబరు 14న వరల్డ్​ డయాబెటిస్​ డే

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మానసిక ఒత్తిడికి గురికావడం..  ఫాస్ట్​, జంక్​ఫుడ్​ తీసుకోవడం… వ్యాయామం చేయకపోవడంతో ‘డయాబెటిస్​’  లేదా చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని, ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం చేయడం వల్ల నియంత్రించవచ్చన్నారు సీనియర్​ ఎండో క్రినాలజిస్ట్​ డా.పి. శ్రీనివాసులు.  నవంబరు 14న వరల్డ్​ డయాబెటిస్​ డే ను పురస్కరించుకుని ఆదివారం రాత్రి కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మధుమేహం లేదా చక్కెర వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డా.పి. శ్రీనివాసులు మాట్లాడుతూ .. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్ అని,  వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ గా వ్యవహరిస్తారు.  ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీనిని చెప్పవచ్చు. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించటం, బరువు తగ్గడం, బద్ధకం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ఒక్కసారి ఈ మ‌ధుమేహం వస్తే త‌గ్గడం అంటూ ఉండ‌దు. చక్కెర వ్యాధి వచ్చిన వారు ఏదిపడితే అది తినకూడదు. తీసుకునే ఆహారానికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. లేదంటే శ‌రీరంలో విచ్చల‌విడిగా చ‌క్కెర‌స్థాయులు పెరిగిపోతాయి.

తీపి పదార్థాలతో…రాదు

తీపి ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ‌స్తుంద‌నేది ఏమాత్రం నిజం కాదు. మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మధుమేహంతో బాధపడేవారు చక్కెరను ఎప్పటికీ తినకూడదు అనేది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధి గ్రస్తులు కేక్ లు వంటి వాటిని తినాలంటే దానికి కొంత ప్రణాళిక అవసరం. స్వీట్లు, కుకీలలో పిండి పదార్థాలు ఉంటున్నందున డయాబెటిక్ రోగులు.. వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం స్థానంలో ఒక చిన్న కేక్ ముక్కను తీసుకోవచ్చు.

వంశపారం పర్యంగా…

వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వఉండే పచ్చళ్లు, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.

వ్యాయామం.. అత్యవసరం…

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలని సీనియర్​ ఎండో క్రినాలజిస్ట్​ డా. పి. శ్రీనివాసులు వెల్లడించారు. అనంతరం హార్ట్​ఫౌండేషన్​ ఆధ్వర్యంలో డా.పి. శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు.

ప్రాణదాతకు.. ఘనసన్మానం…

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో 25 ఏళ్లుగా గుండె వైద్యనిపుణులుగా పని చేసి.. లక్షల మందికి ప్రాణదాతగా నిలిచిన  డా. పి. చంద్రశేఖర్​ను కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పూలమాల వేసి.. శాలువాతో సత్కరించారు.  ఈ సందర్భంగా డీఆర్​ఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో విశేష వైద్యసేవలు   అందించిన డా. పి. చంద్రశేఖర్​ను వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో హార్ట్​ ఫౌండేషన్​ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్​ కల్కూర, సభ్యులు రాముడు, యూనివర్శిటీ వైస్​  చైర్మన్​ సాయిగోపాల్​ తదితరులు పాల్గొన్నారు.

About Author