నవజాత శిశువులను జాగ్రత్తగా చూసుకోవాలి: డా. నవీద్
1 min read*కర్నూలు కిమ్స్‌లో ఘనంగా ప్రీమోచ్యూరిటీ డే సంబరాలు
పల్లెవెలుగు వెబ్: కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రీమోచ్యూరిటీ డే సంబరాలు ఘనంగా జరిగాయి. నెలలు నిండకముందే పుట్టి, ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన 25 మందికి పైగా పిల్లలు, వారి తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి తరఫున, నియోనాటల్ బృందం తరఫున తల్లిదండ్రులందరినీ డాక్టర్ భారతి ఆహ్వానించారు. ఇంతమంది పిల్లలను ఒకేసారి ఇక్కడ చూడటం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోకెల్లా అత్యుత్తమ నియోనాటాలజీ యూనిట్ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలోనే ఉందని కన్సల్టెంట్ నియోనాటాలజిస్టు డాక్టర్ నవీద్ చెప్పారు. దీంతో ఇక్కడ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. బృందంలోని మొత్తం వైద్యులు, సిబ్బంది, నర్సులు కష్టపడి పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన చెప్పారు. శ్రమకోర్చి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నెలలు నిండకముందే పుట్టిన పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు, నియోనాటల్ నర్సుల పాత్రను ఆయన ప్రశంసించారు. ఇలాంటి పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం విషయాలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, ఎప్పటికప్పుడు వైద్యుల వద్దకు తీసుకెళ్తుండాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ పిల్లలను ఇక్కడి నియోనాటల్ యూనిట్‌కు తీసుకొచ్చినప్పటి అనుభవాలను పలువురు తల్లిదండ్రులు గుర్తుచేసుకుని, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నియోనాటల్ నర్స్ రోసీ, పద్మలు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా చిన్న పిల్లల సంరక్షణలో నియోనాటల్ నర్సుల పాత్రను పునరుద్ఘాటించారు.ఈ సందర్భంగా పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ పీవీ రవికిరణ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెలలు నిండని శిశువులకు హై ఎండ్ ఇంటెన్సివ్ కేర్, అద్భుతమైన ఫలితాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పీడియాట్రిక్ బృందం నుండి డాక్టర్ సుష్మ, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ దీప్తితో పాటు ప్రసూతి వైద్య బృందం నుండి డాక్టర్ కుసుమ మరియు డాక్టర్ సంధ్య కూడా హాజరయ్యారు.