రైతులకు రూ.2.6 కోట్లు కుచ్చుటోపి..!
1 min readసదరు వ్యాపారి ఇంటిని దౌర్జన్యంగా రాయించుకున్న కొందరు నాయకులు
– ప్రాణహాని ఉందని నందికొట్కూరు పీ.ఎస్.లో ఫిర్యాదు..
– కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారికి అండగా నిలిచిన రైతులు
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన రైతులకు.. ఓ వ్యాపారి 2.60 కోట్లు కుచ్చుటోపి పెట్టాడని కొణిదెల గ్రామానికి చెందిన 185 మంది రైతులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బు ఇవ్వమని ఎంత అడిగినా… నీకిష్టమొచ్చిన వారికి చెప్పుకోండి.. నేను డబ్బులు ఇవ్వను అని తెగేసి చెప్పడంతో.. రైతులు సదరు వ్యాపారిపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. కానీ అదే గ్రామానికి చెందిన కొందరు నాయకులు బెదిరించి.. హత్యాయత్నంకు పాల్పడి.. దౌర్జన్యంగా తన ఇంటిని రాయించుకున్నారని సదరు వ్యాపారి రైతుల వద్ద మొర పెట్టుకోవడంతో… ఆ రైతులే వ్యాపారికి అండగా నిలిచారు. రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి కొణిదెల గ్రామానికి చెందిన వ్యాపారి శివ పుల్లయ్య అదే గ్రామానికి చెందిన 185 మంది రైతులు వద్ద మార్చిలో మొక్కజొన్న, కందులు, పెసలు, శనగలు, వరి ధాన్యాన్ని తీసుకున్నాడు. 15 రోజుల్లో డబ్బులు ఇస్తానన్నాడు. రోజులు, నెలలు గడచినా ఇవ్వలేదు. అదేమంటే కొద్ది రోజుల్లో ఇస్తానని, పెళ్లి ఉందని చెబుతూ వచ్చాడు. చివరకు తాను ఇవ్వను మీకు చేతనైంది చేసుకోమన్నాడు. దీనితో రైతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి వ్యాపారి శివ పుల్లయ్యను రిమాండ్ కు పంపారు.
బెదిరింపులతో.. ఇల్లు రిజిస్ర్టేషన్..
బయటకు వచ్చిన వ్యాపారి శివపుల్లయ్య.. గ్రామం వదిలి గూడురుకు మకాం మార్చాడు. నాటి నుండి నేటి వరకు రైతులకు ఒక పైసా కూడా చెల్లించలేదు. ఇది జరిగి రెండేళ్లయ్యింది. ఇది ఇలా ఉండగా వ్యాపారి శివ పుల్లయ్య తన ఇంటిని చల్లా శివ కుమార్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలియడంతో .. రైతులు చల్లా శివకుమార్ రెడ్డిని నిలదీశారు. కేసు కోర్టులో ఉండగా ఇల్లు ఎలా కొంటావని ప్రశ్నించిన రైతులకు… తనకు రూ.5 లక్షలు వ్యాపారి అప్పు ఉన్నాడని, అందు వల్ల ఇల్లు అమ్మకానికి పెట్టగా తానే రూ. 20 లక్షలకు తీసుకున్నట్లు చెప్పొకొచ్చాడు. ఈ విషయంపై ఐదు రోజుల క్రితం (సోమవారం) రైతులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారిని పట్టుకొస్తే రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడం తో పరారీలో ఉన్న వ్యాపారిని వెదికిపట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీనితో వ్యాపారి శివ పుల్లయ్య జరిగి విషయం పోలీసుల ఎదుట చెప్పుకొచ్చాడు.
ఇంటిపై కన్నేసి.. వేధింపులకు గురి చేసి..
చల్లా శివ కుమార్ రెడ్డి, మరో నలుగురు వ్యక్తులు గత నెల మార్చి 28 న గూడూరు మార్కెట్ వద్ద ఉన్న తనను కారులో తీసుకోని వెళ్ళి నందికొట్కూరు మండలంలోని కొనేటమ్మపల్లి గ్రామంలోని రఘురామిరెడ్డి ఇంటిలో బంధించి, రెండు రోజులు చిత్రహింసలకు గురిచేశారని సదరు వ్యాపారి శివపుల్లయ్య రైతుల ఎదుట వాపోయాడు. అనంతరం తనను, తన తమ్ముడిని చంపుతామని బెదిరించారు. రెండు రోజుల తర్వాత నన్ను నందికొట్కూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. నన్ను భయపెట్టి బలవంతంగా ఇంటిని వ్రాయించుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిచి విచారణ చేశారు. బాధితుడు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చల్లా శివ కుమార్ రెడ్డి, రఘురామి రెడ్డి, మరో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.