కలిసికట్టుగా.. కరోనాను తరిమికొడదాం..
1 min read–‘ ఫీవర్ సర్వే’ వివరాలు ప్రజాప్రతినిధులకు పంపండి..
– బిచ్చగాళ్లకు, అనాథలకు భోజనం పెట్టండి
– నిధులు నేను సమకూరుస్తా..
– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్‌నగర్ : అధికారులు, ప్రజాప్రతినిధులు..సమన్వయంతో పని చేసి.. కరోనాను తరిమికొడదామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల జెడ్పీ చైర్మన్ లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,జిల్లా కలెక్టర్లు,ఎస్పి లు, షాద్నగర్ అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, కర్ఫ్యూ సమయంలో నిత్యాసర సరుకులకు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని పోలీసు, జిల్లా అధికారులను ఆదేశించారు.
ఆక్సిజన్.. అవసరం : ప్రైవేట్ ఆస్పత్రల్లోనూ ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు సిద్ధంగా ఉండాలని, అవసరం ఉంటేనే వాటిని వినియోగించాలని మంత్రి శ్రీనివాస గౌడ్ సూచించారు. గ్రామంలో పది మందికి కరోనా సోకితే.. అక్కడికే వైద్యులను పంపాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో రెండు రోజుల్లో 500 పడకల కరోనా వార్దు సిద్ధం చేస్తున్నారని, ఎస్వీఎస్లో వంద పడకల ఐసోలేషన్ బెడ్లు, షాద్‌నగర్‌లో 30 పడకల ఆక్సిజన్‌తో కూడిన బెడ్లు సిద్ధమవుతున్నాయన్నారు. బిచ్ఛగాళ్లకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లా ఆస్పత్రి ఆవరణలో రోగుల సహాయకులకు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులు తానే సమకూరుస్తానని మంత్రి శ్రీనివాస గౌడ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా వీసీలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, నారాయణ పేట ఎస్పీ పి. చేతన, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన, షాడ్ నగర్ అనపు కలెక్టర్ .. లాక్డౌన్ అమలు, కర్ఫ్యూ సమయంలో ప్రజలకు , కరోనా పేషెంట్లకు చేస్తున్న సేవలు తదితర అంశాలను మంత్రికి క్షుణ్ణంగా వివరించారు . వీసీలో
మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ ,నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు, పోలీస్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.