బనగానపల్లెలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
1 min read– తమ తమఅభ్యర్థులు గెలుపు కోసం తాజా, మాజీ ఎమ్మెల్యేలు , ఉపాధ్యాయ సంఘాల విస్తృత ప్రచారం
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : పట్టణంలోఈనెల 13న జరగనున్న శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపుకోసం బనగానపల్లె తాజా, మాజీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుదారులు, ఉపాధ్యాయ సంఘాల వారు విస్తృత ప్రచారం చేపట్టడంతో బనగానపల్లి నియోజకవర్గలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. వైకాపా పార్టీ తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా వెన్నుపూస రవీంద్రా రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంవి రామచంద్రారెడ్డి, టీడీపీ పార్టీ తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాలరెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డిలు తమ పార్టీ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకై నియోజకవర్గ పరిధిలోని బనగానపల్లె, అవుకు,సంజమాల,కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లోని ప్రభుత్వ,ప్రయివేట్ విద్యాలయాలకు వెళ్లి టీచర్లను , ఓటు హక్కు ఉన్న పట్టభద్రులను కలిసి తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యరులకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న శ్యామల అనిల్ వెంకటప్రసాదరెడ్డి గెలుపుకై ఎపిటీఎఫ్ వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అలాగే పీడీఫ్ తరపున పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీలుగా పోటీలోఉన్న గ్రాడ్యుయేట్ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిల గెలుపునకై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న ముగిసే ఈ ఎన్నికల ప్రచారం ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతోంది. ఎవరికి వారు ఓటర్లను నేరుగా కలుస్తూ కరపత్రాలను పంచుతూ మొదటి ప్రాధాన్యత ఓటు తాము బలపరుస్తున్న అభ్యర్ధులకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. బనగానపల్లె పరిధిలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని, మాజీ ఎమ్మెల్యే బీసీజేఆర్ లు ఎవరికి వారు తాము స్వయంగా ప్రచారం చేస్తూ, గ్రామాల్లో తమ అనునాయులచే ప్రచారం చేయిస్తూఉండటం గమనార్హం.