ఆపరేషన్ మదర్ టైగర్..
1 min read– కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
– తల్లి కోసం తల్లడిల్లుతున్న పులి కూనలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : అప్పుడే పుట్టిన పసి పులికూనలను వదిలిపెట్టి వెళ్లిన తల్లి పులి కోసం ఆపరేషన్ మదర్ టైగర్ కొనసాగుతూనే ఉంది. తల్లి చెంతకు పులికూనులను చేర్చడం కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద గుమ్మాడ అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన అధికారులు, ఆ ప్రాంతంలో పులి సంచరిస్తుందని భావించి నిన్న అర్ధరాత్రి తల్లి పులి చెంతకు నాలుగు పులికూనలను చేర్చడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఆపరేషన్ మదర్ టైగర్.. అర్దరాత్రి తీవ్ర యత్నం.
తల్లి పులి కోసం అన్వేషణ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు తల్లి కోసం తల్లడిల్లుతున్న నాలుగు పులికూనలను తల్లి వద్దకు చేర్చేందుకు నిన్ను అర్ధరాత్రి ప్రయత్నం చేశారు. రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాలలో పులికూనలను ఉంచి కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. మిగతా ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలను, ప్లగ్ మార్క్ ఆధారాలను సేకరించే పనిలో ఉన్న అధికారులు ఎలాగైనా పులి జాడ కనిపెట్టి పసి పులికూనలను తల్లి చెంతకు చేర్చే తీరాలని ప్రయత్నం చేశారు.
పులికూనలను వెనక్కు తీసుకొచ్చిన అధికారులు..
అయితే రాత్రంతా ఎదురుచూసిన తల్లి పులి మాత్రం రాలేదు. తల్లి కోసం తల్లడిల్లుతున్న పులికూనలు దిక్కులు చూస్తూ రాత్రంతా గడిపాయి. అసలు పులి జాడ, కదలికలు కనుగొనలేకపోవటంతో అసలు పులి అక్కడే ఉందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంత ప్రయత్నించినా పులి కనిపించకపోయేసరికి చివరకు చేసేదేమీ లేక అటవీ శాఖ అధికారులు పులికూనలను ఆత్మకూరు క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం పులికూనలు అటవీ అధికారుల సంరక్షణలో ఉన్నాయి.
ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్…
మళ్లీ ఆపరేషన్ మదర్ టైగర్ లో భాగంగా గాలింపు కొనసాగిస్తున్న అటవీ అధికారులు 300 మంది సిబ్బందితో 50 మంది అటవీ శాఖ అధికారులతో అసలు పులి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని రోజులైనా ఎందుకు కనిపించడం లేదు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక పసి పులికూనలు తల్లిని చేరాలని అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నం చూసి అటవీ శాఖ అధికారులు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.