వీధి కుక్కలతో జనాలు బెంబేలు..!
1 min read– నాలుగు నెలలో 500 మంది కుక్కకాటు కు గురయ్యారు.
– రోజురోజుకు పెరుగుతున్న కుక్క కాటు బాధితులు.
– సీరియస్ అయితే ప్రాణాలు పోవడమే.
– వీధి కుక్కలను తరలించడంలో అధికారుల వైఫల్యం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో వీధి కుక్కలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. తమ మానాన తాము వెళుతున్నవారిపై కుక్కలు ఎగబడుతున్నాయి. అప్రమత్తమయ్యేలోపే కరిచేస్తున్నాయి. ఫలితంగా కుక్క కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నందికొట్కూరు పట్టణ మరియు మండలంలో ప్రతి ఏటా 600 నుంచి 100 దాకా కుక్కకాటుకు ప్రజలు గురి అవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని చెబుతున్నారు.
నాలుగు నెలల్లో 493 బాధితులు..
నందికొట్కూరు (సిహెచ్ సి ) ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు నెలల కాలంలో నమోదైన కుక్క కాటు బాధితులు 400 పైగానే ఉన్నారు. 2022 నవంబర్ డిసెంబర్ 2023 జనవరి, ఫిబ్రవరి నాలుగు నెలల్లో 493 మంది కుక్క కాటుకు గురైనట్లు తెలుస్తోంది . వీరిలో అత్యధికంగా 136 మంది చిన్నపిల్లలు ఉన్నారు. నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి నెలకు దాదాపు 100 నుంచి 150 మంది దాకా కుక్క కాటు బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. గడచిన నాలుగు నెలల కాలంలో 2022 నవంబర్ లో 102 మంది , డిసెంబర్ లో 116 మంది, 2023 జనవరిలో అత్యధికంగా 144 మంది, ఫిబ్రవరిలో 131 మంది కుక్క కాటు భారిన పడ్డారు. వీరిలో పురుషులు 217 మంది, మహిళలు 140 మంది కుక్క కాటు బాధితులు ఉన్నారు.
కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలి.
పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాలలో కుక్కలు సంచరిస్తూ వచ్చి పోయే వాహన దారులు,పాదచారులు వెంట పడుతున్నాయి.వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ సొమ్ము వృధా..
జాన్ .ఏబీఎం పాలెం. నందికొట్కూరు
అధికారులు మున్సిపాలిటీ లో వీధి కుక్కలను తరలించడానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసినా ఎలాంటి సత్పలితాలు ఇవ్వలేదు. పట్టణంలో కుక్కలను పట్టి పట్టణ శివారు ప్రాంతాల్లో వదిలివేస్తున్నారు. .అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలను పట్టణం నుంచి దూర ప్రాంతాలకు తరలించాలన్నారు.