ఎస్టీ ,ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
1 min read– జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కాలయాపన చేయకుండా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డితో కలిసి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఎస్,సి ఎస్టీల అట్రాసిటీ కేసులు దీర్ఘకాలం పెండింగ్లో ఉండకుండా వేగవంత పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని అధికారులను, కమిటీ సభ్యులను కోరారు. కొత్తగా జిల్లా ఏర్పాటైన 4-4-2022 నుండి 31-12-2022 వరకు 69 కేసులు రిజిస్టర్ కాగా ఇందుకు సంబంధించి 102 మంది బాధితులకు ఎఫ్ఐఆర్ నమోదైన వాటికి 24.50 లక్షలు, చార్జ్ షీట్ అయిన వాటికి 81.75 లక్షలు వెరసి మొత్తం 1.6 కోట్లు పరిహారం చెల్లించామన్నారు. అలాగే 1-1-2023 నుండి 25-3-2023 వరకు జిల్లాలో 62 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో 21 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైన వాటికి 52.93 లక్షలు చార్జ్ షీట్ అయిన వాటికి 83.12 లక్షలు వెరసి మొత్తం 1.36 కోట్లు పరిహారం చెల్లించామన్నారు.పెండింగ్లో ఉన్న కేసులపై సంబంధిత అధికారుల నుండి నివేదికలు తెప్పించుకొని సత్వరమే పరిష్కరించి నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ పుల్లయ్యను కలెక్టర్ ఆదేశించారు. ఎంప్లాయిమెంట్ నిమిత్తం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత ప్రతిపాదనలను కర్నూలు జిల్లా కేంద్రానికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జీవన్ రాజు, రమేష్, చిటికల సలోమి, దిలీప్ రాజు, అశోక్ నాయక్, మమత, శ్రీనివాసులు సూచించిన మేరకు అన్ని మండలాల్లోని ఎస్సీ కాలనీలకు స్మశాన వాటికలకు సంబంధించి స్థలాలను గుర్తించి నివేదికలు తెప్పించుకోవాలని డిఆర్ఓ ను సూచించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి అసైన్డ్ భూములు, 90 రోజుల ఇళ్ల పట్టాల కింద ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కస్తూరిబా బాలికల పాఠశాలల్లో మెనూ ప్రకారం ఆహార పదార్థాలు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష అభియాన్ సెక్టోరల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 42 చెంచు గూడెంలకు సీనియర్ అధికారులకు మౌలిక వసతుల కల్పనపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించామని రాగానే సంబంధిత ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. అంబేద్కర్ విగ్రహ మార్పుకు సభ్యులు సూచించిన స్థలాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన విచారణలో సాక్షులు సహకరించాలని సూచించారు. అక్రమ సారా తయారీ, మత్తు పదార్థాల రవాణా చేసే వ్యక్తులపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందే తప్ప అమాయకుల పైన ఎలాంటి చర్యలు తీసుకోమని ఎస్పీ వివరించారు. అలాగే ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నంద్యాలలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ సరిగా జరగలేదని విజిలెన్స్ కు పంపించాలని డ్వామా పిడిని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సభ్యులు ప్రతి కేసుపై క్షుణ్ణంగా అవగాహన పొంది సంబంధిత అంశంపై వినతి పత్రంతో సమావేశానికి రావాలని సూచించారు.జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతినెల 30వ తేదీ పౌర హక్కుల దినోత్సవం జరపాలని కలెక్టర్ ను కోరారు. అలాగే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిఆర్ఓ ను సూచించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా సంబంధిత కాలనీల అభివృద్ధికి వినియోగించాలని సభ్యులు కోరారు.ఈ సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికారిక సభ్యులైన సివిల్ సప్లై డిఎం రాజునాయక్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ జయన్న, సంక్షేమ శాఖ డిడి చింతామణి, నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల డిఎస్పీలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.