ఒంటిపూట బడులు వచ్చాయి.. పిల్లలూ జాగ్రత్త..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దాదాపు పది నెలలు రోజంతా పాఠశాలలో గడిపి.. ఎప్పుడెప్పుడు ఒంటిపూట బడులు వస్తాయా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించేసింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండి విసుకు చెందుతున్న వారికి ఏప్రిల్ 3 నుంచి ఒంటిపూట బడులు నడుపుతూ పిల్లలకు నోరు తీపి చేసింది. ఉదయం 7.45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12. గంటల వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి పనిచేస్తున్నాయి. అయితే మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం 8 గంటలకు బడికి వెళ్లి సాయంత్రం నాలుగు తర్వాత ఇంటికి చేరేవారు. వారిని తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇంటి పెద్దలు, సంబంధికులు పంపించడం, తీసుకురావడం జరిగేది. మరి దీనికి మారుమూల గ్రామీణ ప్రాంతాలు, పల్లెల్లో ఇది కొంత భిన్నం. ఎందుకంటే అక్కడ పిల్లలే స్వయంగా పాఠశాలకు వెళ్లి, తిరిగొస్తుంటారు. తల్లిదండ్రులు వ్యవసాయ, కూలీ, తదితరుల పనుల్లో నిమగ్నమైపోతారు.
కడుపు సోకం తప్పదు…అయితే ఒంటి బూట బడుల వేళ విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికొచ్చిన అనంతరం వివిధ ఆటలు ఆడటం, స్నేహితులతో కలిసి చెట్లు, పుట్టలు, గట్లు తిరగడం.. అంతేకాకుండా చిన్న నీటి కుంటల నుంచి పెద్ద చెరువులు, వ్యవసాయ బావుల్లో సరదాగా ఈతకు వెళ్లడానికి సమూకత చూపుతారు. అలాంటి వారిలో ఈత నైపుణ్యం ఉన్నవారు, ఈత రానివాళ్లూ ఉంటారు. అంతేకాకుండా ఇతరులను చూసి తాను నేర్చుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. కొందరేమో మేమున్నాం కదా ఏం భయపడకు, నీటిలో దూకేసేయ్ అని, ఇంకొందరికి ఆసక్తి లేకపోయినా వాళ్లని వెనకాల నుంచి నీటిలో నెట్టి వేయడం వంటివి తోటి మిత్రులు చేస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఎంతో మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు చాలా వెలుగు చూశాయి. అదేవిధంగా ఇంటి ఆవరణంలో నీటి తొట్లు, ట్యాంకులు ఉండటం సర్వసాధారణం. ఇంటి వద్ద ఆడుకుంటూ అవి గమనించక వాటి సమీపానికి వెళ్తుంటారు. వాటిపై మూతలు పెట్టకపోవడంతో గాని, ఏదైనా అవసరానికి నీరు తోడే ప్రయత్నంలో అందులో పడి మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి విషాద ఘటనల్లో 5 నుంచి 20 ఏళ్లలోపు వారు ఎక్కువ ఉంటున్నారు. వారి సరదాకు, తెలిసి తెలియని తప్పిదాలకు ఫలితంగా తల్లిదండ్రులకు కడుపుసోకం తప్పడం లేదు.
బాధ్యతగా కనిపెడుతూ.. పాఠశాల విడిచిన అనంతరం పిల్లలు ఆడుకునే సమయాల్లో, ఈతకు వెళ్లే సందర్భాల్లో కుటుంబీకులు, సంరక్షకులు, ఇరుగుపొరుగువారు వారిని బాధ్యతగా కనిపెడుతుండాలి. వాళ్ల కదిలికలను గమనిస్తూ మంచి, చెడు, అపాయాల గురించి చెప్పాలి. ఆటలు ఆడించడం, ఈత నేర్పటం వంటివి స్వయంగా సంబంధికుల పర్యవేక్షణలో జరిగితే ఎలాంటి ప్రమాదాలకు తావుండదు. తల్లిదండ్రులు, ఇతరులకు చెప్పకుండా బయట తిరిగే పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వాళ్లను దారిలోకి తీసుకురావాలి. మానసిక స్థితికి అనుగుణంగా మాటలు, చేతల ద్వారా గాడిలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలను ఒంటిపూట బడులప్పుడు, వేసవిలో, ఇతర సమయాల్లోనూ వివిధ అనర్ధాలు, ప్రమాదాలు, అపాయాల భారి నుంచి వారిని రక్షించుకోగలం.తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.