అకాల వర్షం రైతుల పాలిట శాపం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటి పాలు కావడం గిట్టుబాటు ధర లేక పంట పెట్టుబడి చేతికి వస్తుందో లేదో అని అన్నదాతలు అల్లాడుతున్నారు మండలంలోని కరిమద్దేల గడివేముల గ్రామ శివారులలో మిర్చి పంట ఆరబెట్టిన కల్లాలో ఆదివారం రాత్రి 12 గంటలకు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి నీటిలో మిరప పంట చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదనవృతం చేశారు అకాల వర్షాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా విరుచుకుపడుతున్న వానలతో తడిసిన ఆరేలోపే మళ్లీ వర్షం కురుస్తూ అన్నదాతలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండు వేసవిలో ఓ వైపు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే అంతలోనే దంచికొడుతున్న వానలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలతో పంటలకు ఇంకెంత నష్టం వాటిల్లుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.