PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేల చూడాలి

1 min read

– ధాన్యం కొనుగోలు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.
– కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పౌరసరఫరాల శాఖ సివి,ఎండి జి వీర పాండ్యన్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టిన ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని అధికారులను, కేంద్రాల నిర్వాహకులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్ మరియు యండి జి. వీరపాండ్యన్ ఆదేశించారు. మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సువర్ణ రైస్ మిల్లును జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి పౌర సరఫరాల శాఖ యండి జి. వీరపాండ్యన్ పరిశీలించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లైయిస్ యండి జి. వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా సీతంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఈ కేంద్రం ద్వారా ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అగ్రికల్చర్ అసిస్టెంట్ ను సమాచారం అడుగగా 2,429 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. అలాగే ఈ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారని వారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయని యండి అడుగగా 596 మంది రైతులకు 15 వందల ఎకరాలు సాగుభూమి ఉందని కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రైతుల నుంచి శాంపిల్స్ సేకరణ, తేమశాతం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలింపు, ధాన్యం రకాలు, గోనె సంచులు, రవాణా తదితర అంశాలను రైతులను, అధికారులను యండి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు క్షేత్రస్ధాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకొని రైతులకు మరింత అవగాహన పెంచి ఎక్కువ శాతం ధాన్యం కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోవచ్చన్నారు. రైతులు కొనుగోలు చేసిన ధాన్యంకోసం మిల్లులకు వెళ్లవలసిన పనిలేదని వాటిని ఆర్ బి కె, సివిల్ సప్లైయిస్, రెవిన్యూ వారి పర్యవేక్షణలో జరుగుతుందని రైతులకు స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ ద్వారా ఈ-క్రాప్ బుకింగ్ డేటా వస్తేనే తప్పా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉండదన్నారు. కొంతమంది రైతులు ప్రతి సంవత్సరం రైతులకు మెరుగైన పంట దిగుబడి వచ్చే వంగడాల గురించి ముందుగానే తెలియజేస్తే వాటిని సాగుచేసుకుని అధిక దిగుబడి పొందుతామని ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ ద్వారా రైతులకు తెలియపరచాలని యండిని కోరారు. ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లోను రైతులు పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించడమే కాకుండా, ట్రాన్స్ పోటేషన్ కల్పించిందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కరపత్రాల ద్వారా, బ్యానర్స్ ద్వారా రైతులకు అర్ధమయ్యే రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్ మరియు యండి జి. వీరపాండ్యన్ జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణితో కలిసి సీతంపేటలోని సువర్ణ రైస్ మిల్లును పరిశీలించారు. ఇప్పటి వరకు మిల్లుకు చేరిన ధాన్యం వివరాలను జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆళ్ళ సతీష్ చౌదరిని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్స్ వద్దకు వచ్చిన ధాన్యం కొనుగోళ్ల లారీలను ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని యండి తెలిపారు. వీరి వెంట ఏలూరు ఆర్డిఓ కె. పెంచల కిషోర్, సివిల్ సప్లైయిస్ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, జిల్లా సివిల్ సప్లైయిస్ అధికారి ఆర్.ఎస్.ఎస్ రాజు, తహశీల్దారు నాంచారయ్య, వ్యవసాయశాఖ ఎడి వై. సుబ్బారావు, ఎఓ జి. రమేష్, సీతంపేట సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామయ్య, సర్పంచ్ కనకరాజు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

About Author