రేమట గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కు వినతి
1 min read– రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు, ఆర్వీపీఎస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,మదాసి మదారి కరువ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న, రాయలసీమ యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వీవి నాయుడు, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్ తో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కర్నూలు మండలంలోని ఉల్చాల నుండి రేమట గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను గత కలెక్టర్ ను కలిసి ఎన్నోసార్లు విన్నవించామని అయినా రేమట గ్రామ రోడ్డు నిర్మాణం మాత్రం మొదలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి వెళ్లే రోడ్డు ఉల్చాల గ్రామం నుండి పూర్తిగా పాడైపోవడంతో మోకాళ్లలోతు గుంతలు ఏర్పడి గ్రామస్తులు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారని గ్రామంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని గ్రామానికి అంబులెన్సులు కూడా రావడం లేదని జిల్లా కలెక్టర్ సృజన కు తెలియచేసారు అందుకు స్పందించిన కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన తప్పక రోడ్డు నిర్మాణం చేపడతామని తాను శాంక్షన్ చేస్తానని వారికి మాటిచ్చారు. గతంలో ప్రజా ప్రతినిధులకు,అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాలేదని నూతన కలెక్టర్ వెంటనే స్పందించి సాంక్షన్ చేస్తాననడంతో కలెక్టర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎర్రకోట మల్లప్ప, బురుజుల నాగభూషణం,వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.