అంబేద్కర్ ను అవమానించిన రామేశ్వర రెడ్డి ని అరెస్ట్ చేయాలి
1 min read– కేవిపిఎస్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలం, అగ్రహారం గ్రామంలో దళితులకోసం తహసీల్దారే రెండు నెలల క్రితం కేటాయించిన స్థలం చుట్టూ వేసుకున్న ఇనుప కంచెను పీకి, అందులో పాతుకున్న అంబేద్కర్ చిత్ర పటం తో కూడిన ఫోల్ కు సిమెంట్ అంటించి అవమానపరిచిన రామేశ్వర రెడ్డి కుటుంబం పై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ డిమాండ్ చేశారు. గురువారం గోనెగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బి అగ్రహారం దళిత కుటుంబాలతో కలిసి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచ్చేదాకా అవమానాలు పడుతూ బతికే దళితులు, సచ్చిన తర్వాత కూడా పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేక నిరంతర అవమానాలు పడుతూనే ఉన్నారన్నారు. గోనెగండ్ల మండలం బి అగ్రహారం గ్రామంలో స్మశాన స్థలం లేని దళితులు గత రెండు నెలల క్రితం దళితుడైన రాజశేఖర్ చనిపోయిన సందర్భంగా స్మశానం కోసం పోరాడి తహసిల్దార్ చేతనే 44 సెంట్ల భూమిని స్మశాన స్థలం కోసం కేటాయింపు చేయించుకున్నారన్నారు. స్మశానం పక్కనే 30 ఎకరాల భూమి ఉన్న రామేశ్వర రెడ్డి, అది చాలక దళితులకు కేటాయించిన స్మశాన భూమిని సైతం కబ్జా చేసుకున్నాడన్నారు. దళితులంతా రూపాయ, రూపాయ పోగేసుకుని స్మశానం చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెను సంపూర్ణంగా తీసేసి, స్మశానంలో పూడ్చుకున్న అంబేద్కర్ చిత్రపటంతో కూడిన బోర్డుకు బురదనటించిన రామేశ్వర్ రెడ్డి, లక్ష్మీదేవి, మారుతీ రెడ్డి లపై అట్రాసిటీ కేసును నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. తన పొలానికి పోతూ ఘటనను గమనించిన మాలముని, అక్కడికి వచ్చిన గోపాల్, వెంకట రాముడు లు ఎందుకు ఇలా చేశారు అని అడిగినందుకు కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారన్నారు. దళితులకు సంబంధించిన స్మశానం తమ చుట్టూ ఉండకూడదనే కుల దురహంకారంతో, అందులో పాతిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికే సిమెంటు పూసి అవమానించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని వారు మండిపడ్డారు. కేటాయించిన స్థలానికి సంపూర్ణమైన హక్కు కల్పించకుండా నిందితులకు మండల తహసిల్దార్ సహకరిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు ఉన్న కంచ, పొద్దు పొడిచే నాటికి ఎలా తొలగిస్తారని, అంబేద్కర్ ను అవమానించి, అంబేద్కర్ బోర్డును తీసివేస్తూ తిరిగి బోర్డు ఎలా పాతుతారని వారు విమర్శించారు. ఘటన కారణమైన రామేశ్వర్ రెడ్డి లక్ష్మీదేవి అందుకు సహకరించిన గిరీశ్వర్ రెడ్డి మారుతి రెడ్డి రాఘవేందర్ రెడ్డి లపై అట్రాసిటీ కేసును నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని లేని పక్షంలో చలో అగ్రహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు. అనంతరం అగ్రహారం గ్రామ దళితులతో కలిసి గోనెగండ్ల మండల పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అగ్రహారం దళితులు బజారి, గిరిరాజు, వంశీకృష్ణ, దస్తగిరి, ఓబులేసు, మునిస్వామి మరో 20 మంది పాల్గొన్నారు.