జుట్టు రాలుతోందా.. ఇదిగో పరిష్కారం
1 min read– సెంచురీ ఆస్పత్రిలో ఉచితంగా జుట్టు విశ్లేషణ
– రూ.3వేల విలువ చేసే పరీక్షలు ఉచితం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : కేశ సౌందర్యం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. కొవిడ్ తర్వాత చాలామందిలో జుట్టు రాలడం అనేది అతిపెద్ద సమస్యగా కనపడుతోంది. దీనికి పరిష్కారం చూపేందుకు హైదరాబాద్ నగరంలో జుట్టుకు సంబంధించిన ఆరోగ్యం కోసం ఉచిత శిబిరాన్ని సోమవారం నిర్వహిస్తున్నారు. ప్రముఖ చర్మవైద్య నిపుణురాలు, కేశ సంరక్షణ విషయంలో ప్రత్యేకశిక్షణ పొందిన డాక్టర్ అపర్ణా కృష్ణప్ప ఈ శిబిరంలో పాల్గొని, బాధితులకు ఉచితంగా హెయిర్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణంగా అయితే రూ.3వేల విలువ చేసే ఈ పరీక్షను శిబిరంలో పూర్తి ఉచితంగా చేస్తారు. సెంచురీ ఆస్పత్రిలోని ఫాలిక్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
కారణాలు ఎన్నో..
సాధారణంగా జుట్టు రాలడానికి పురుషులు, మహిళల్లో వేర్వేరు కారణాలు ఉంటాయి. మహిళల్లో అయితే ప్రధానంగా పోషకాహార లోపం, థైరాయిడ్, ప్రసవం తర్వాత, అలాగే మెనోపాజ్ దగ్గర పడటం లాంటి కారణాల వల్ల ప్రధానంగా జుట్టు ఊడటం అనే సమస్య ఉంటుంది. ఇక పురుషుల్లో అయితే ప్రధానంగా పోషకాహార లోపంతో పాటు జన్యుపరమైన కారణాల వల్ల కూడా జుట్టు ఊడి బట్టతల వస్తుంది. ఈ కారణాలు వేటితోనూ సంబంధం లేకుండా కొవిడ్ తర్వాత కూడా చాలామందికి జుట్టు ఊడటం అనే సమస్య ఉంటోంది. వీటన్నింటినీ కూడా దాదాపుగా నయం చేయవచ్చని డాక్టర్ అపర్ణా కృష్ణప్ప చెబుతున్నారు. గ్రేడ్ 5 స్థాయి వస్తే తప్ప, మిగిలిన ఏ స్థాయిలోనైనా ఈ సమస్యను నయం చేయవచ్చని ఆమె అంటున్నారు.