సమస్య తెలియకుండానే… ఐదు శస్ర్తచికిత్సలు..
1 min read* కడప రైల్వే ఉద్యోగికి అప్పటికీ తీరని ఇబ్బంది
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అసలు సమస్య గుర్తింపు
* చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిచేసిన డాక్టర్ జానకిరామ్
పల్లెవెలుగు, కర్నూలు: క్లోమ గ్రంధి (పాంక్రియాస్) అనేది మన శరీరంలో చాలా కీలకమైన అవయవం. దానికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే గుర్తించి సరిచేయాలి. కానీ, అసలు సమస్యను గుర్తించకుండా దానికి బదులు వేరే వేరే సమస్యలు అనుకుని ఓ రోగికి వేర్వేరు ఆస్పత్రులలో ఏకంగా ఐదు శస్త్రచికిత్సలు చేశారు. అప్పటికీ ఇబ్బంది తగ్గకపోవడంతో చివరకు కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆ రోగికి.. కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సూరా జానకిరామ్ అసలు సమస్య ఏంటన్నది గుర్తించి, రెండు చిన్నపాటి శస్త్రచికిత్సలు చేసి మొత్తం నయం చేశారు. ఆ రోగి ఎదుర్కొన్న పలు రకాల సమస్యలను, ఆయనకు అందించిన చికిత్సల వివరాలను డాక్టర్ జానకిరామ్ వివరించారు.
‘‘కడపకు చెందిన రైల్వే ఉద్యోగి 43 ఏళ్ల కె.వి. శ్రీధర్‌కుమార్‌కు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఆయనకు తీవ్రమైన నొప్పి రావడంతో అనంతపురంలోని ఒక ఆస్పత్రిలో దానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దాంతో మూడు వంతుల గాల్‌బ్లాడర్‌ను అక్కడ తొలగించారు. కొంతకాలం తర్వాత మళ్లీ నొప్పి రావడంతో ఈసారి హైదరాబాద్‌లోని ఒక పెద్ద ఆస్పత్రికి వెళ్లారు. గాల్‌బ్లాడర్ పూర్తిగా తొలగించలేదని, అందులో రాళ్లు ఉన్నాయని అక్కడ చెప్పి, దాన్ని తీసేయాలన్నారు. అయితే, కాలేయాన్ని సంరక్షించేందుకు పెట్టిన సీవీడీ పైప్‌కు ఇబ్బంది రాకూడదని.. ఒక స్టెంట్ వేశారు. తర్వాత ఒక నెల రోజుల పాటు జ్వరం ఉండటంతో ఆ తర్వాత శస్త్రచికిత్స చేశారు. కానీ ఆ శస్త్రచికిత్స చేసిన సమయంలో క్లోమగ్రంధి సమస్యను గుర్తించలేదు. దాంతో మళ్లీ రెండు నెలలకు జ్వరం, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు రావడంతో శ్రీధర్‌కుమార్ మరోసారి హైదరాబాద్ వెళ్లారు. అప్పుడు సీటీ స్కాన్, ఎంఆర్ఐ చేసి, కేన్సర్ ఉందని చెప్పారు. లివర్ టీబీ లేదా లివర్ కేన్సర్ కావచ్చని అనుమానించారు. దాంతో లివర్ బయాప్సీ చేయగా, కేన్సర్ కాదని.. టీబీ కావచ్చని వచ్చింది. దాంతో టీబీ మందులు వాడటం మొదలుపెట్టారు. నిజానికి టీబీ మందులు వాడితే వెంటనే ఆకలి పెరిగి, బరువు కూడా పెరగాలి. కానీ ఈయన ఇంకా బరువు తగ్గిపోగా, ఆకలి కూడా కాలేదు. దీంతో ఈసారి కర్నూలులో వేరే ఆస్పత్రిలో చూపించగా, కడుపులో చీము ఉందని, దాన్ని తీసేయాలని చెప్పారు. అలా తీసేసిన తర్వాత.. మళ్లీ రెండేసి వారాలకు చీము పడుతుండటంతో దాన్ని డ్రెయిన్ చేసేందుకు ఒక పైప్ వేశారు. దాన్నుంచి దాదాపు ఏడు నెలల పాటు అలాగే చీము వస్తుండటంతో చివరకు కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ సీటీ స్కాన్ చేయగా, ఆ పైపు పెద్దపేగు లోపల ఉందని తెలిసింది. కొలనోస్కొపీ చేయిస్తే, పెద్దపేగుకు రంధ్రం పడినట్లు కనిపించింది. లోతుగా పరిశీలిస్తే పాంక్రియాటైటిస్ అనే సమస్య ఉన్నట్లు గుర్తించాం. శ్రీధర్‌కుమార్‌కు ఉన్నది కేన్సర్ లేదా టీబీ కానే కాదని.. పాంక్రియాస్ (క్లోమగ్రంధి)కి ఇన్ఫెక్షన్ కావడం, అది చుట్టుపక్కల ఉన్న పెద్దపేగును తినేయడంతో చిన్న రంధ్రం పడిందని గుర్తించాం. ఆ రంధ్రం నుంచి స్రావాలు బయటకు రావడం వల్ల చీము ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించడంతో ముందుగా పేగుకు రంధ్రం పూడ్చేందుకు అవసరమైన శస్త్రచికిత్స చేశాం. అందులో భాగంగా చిన్నపేగును బయటకు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. (స్టోమా). మూడు నెలల తర్వాత మరో చిన్న శస్త్రచికిత్స చేసి, దాన్ని మూసేసి యథాస్థానంలో పెట్టేశాం.
నిజానికి ఈ కేసులో ఒక్క ఈఆర్‌సీపీ తప్ప మరే సమస్యా లేదు. కానీ రకరకాల శస్త్రచికిత్సలు చేయడంతో జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది. రోగి సమస్య ఏంటి, దానికి ఎప్పుడు ఏ శస్త్రచికిత్స, ఎలా చేయాలన్నదే ముఖ్యం. డయాగ్నసిస్ ముఖ్యం, దాని ప్రకారమే చికిత్స చేయాలి. అంతకుముందు ఆయనకు ఐదు సర్జరీలు అయ్యాయి. వాటితో ప్రయోజనం లేకపోగా మరిన్ని సమస్యలు రావడంతో చివరకు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో సరైన చికిత్స చేసి, ఆయనకు ఊరట కల్పించగలిగాం’’ అని డాక్టర్ జానకిరామ్ వివరించారు.
తాము 2020 నుంచి పలు రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల చుట్టూ కూడా తిరిగామని, అయినా ఏమాత్రం ఊరట లేకపోగా సమస్య మరింత ఎక్కువైందని శ్రీధర్ కుమార్ భార్య సుహాసిని తెలిపారు. ఎట్టకేలకు కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత తన భర్తకు సరైన చికిత్స లభించిందని, దీంతో ఆయన పూర్తి ఆరోగ్యం సంతరించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి, సిబ్బందికి, ముఖ్యంగా డాక్టర్ సూరా జానకిరామ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.