బాలభీముడు..5.2 కిలోల బరువున్న శిశువు జననం
1 min read* కడుపు భారీగా ఉన్న మహిళకు కిమ్స్ సవీరాలో శస్త్రచికిత్స
అనంతపురం: సాధారణంగా పుట్టిన వెంటనే మన దేశంలో పిల్లలు 2.5 నుంచి 4 కిలోల వరకు బరువు ఉంటారు. 3-3.5 కిలోలను సగటు బరువుగా చెబుతుంటారు. కానీ అనంతపురం జిల్లాలో తొలిసారిగా 5.2 కిలోల బరువున్న శిశువు జన్మించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ శిల్పా చౌదరి తెలిపారు. ‘‘ధర్మవరానికి చెందిన 30 ఏళ్ల వయసున్న మహిళ ఉమ్మనీరు బాగా ఎక్కువ ఉందని, పొట్ట బాగా ఉబ్బిందని, బీపీ ఎక్కువగా ఉందని ఇక్కడకు పంపారు. ఆమె భర్త ఆ ప్రాంతంలో రోజుకూలీగా పనిచేస్తుంటారు. ఈమెకు స్కాన్ చేసి చూస్తే గర్భస్థ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో పాటు ఉమ్మనీరు కూడా చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా 5 సెంటీమీటర్ల స్థాయిలో ఉండే ఉమ్మనీరు ఏకంగా 28 సెంటీమీటర్లు ఉంది. బాగా హైరిస్కు కేసు కావడంతో వెంటనే చేర్చుకుని వైద్య పరీక్షలు చేశాం. ఆమె పొట్ట బాగా ఉబ్బిపోయింది. దాదాపు మెడవరకు వచ్చింది. సాధారణంగా గర్భిణులకు పొట్ట 36 అంగుళాలు ఉంటుంది. కానీ ఈమె విషయంలో ఉమ్మనీరు ఎక్కువ ఉండటం, లోపల గర్భస్థ శిశువు బరువు కూడా ఎక్కువ కావడంతో ఈమెకు 48 అంగుళాల పొట్ట ఉంది. దాంతో మత్తు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యింది. అయినా అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేశాం. ఐదో నెల తర్వాత ఆమెకు ఒక్క స్కాన్ కూడా లేదు. దాంతో వెంటనే స్కాన్ చేసి చూస్తే విషయం తెలిసింది. అంతకుముందే ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు కూడా పుట్టినప్పుడు బరువు ఎక్కువగానే (3.7, 4.5) ఉండటంతో అప్పుడూ సిజేరియన్లు చేశారు. మొదటిసారి గర్భం దాల్చినప్పుడే మహిళకు మధుమేహం, రక్తపోటు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రసవానికి వచ్చేసరికి కూడా మధుమేహం, రక్తపోటు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. కేసులో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. బాబును ముందుజాగ్రత్తగా 10 రోజుల పాటు ఎన్ఐసీయూలో ఉంచి పరీక్షించాం. ఎటువంటి సమస్యలు లేకపోవడంతో డిశ్చార్జి చేశాం. డిశ్చార్జి సమయానికి తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. బాబుకు భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా గమనించుకోవాలని చెప్పాం’’ అని డాక్టర్ శిల్పాచౌదరి వివరించారు.