PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మస్కట్ లో చిక్కుకున్న.. మహిళకు అండగా హోంమంత్రి

1 min read

– మంత్రి చొరవతో స్వగ్రామం తిమ్మరాజుపాలెం చేరుకున్న గెడ్డం ప్రభ..

–హోంమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.. 

– దళారులు, ఏజెంట్లు మాటలు నమ్మి మహిళలు మోసపోవద్దు

– హోం మంత్రి తానేటి వనిత

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్ లో చిక్కుకుపోయిన ఒక యువతి హోంమంత్రి తానేటి వనిత చొరవతో తన స్వగ్రామం చేరుకున్నారు. దీంతో శుక్రవారం హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఆ కుటుంబమంతా కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెంకు చెందిన గెడ్డం ప్రభ ఉపాధి వెతుక్కుంటూ మస్కట్ కు వెళ్లిందని, తన కూతురుకి అక్కడ ఎదురైన పరిస్థితిని తల్లి కొండేపూడి సత్యవతి వివరించడంతో హోంమంత్రి చలించిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక, అర్ధాకలితో జీవించలేక తిరిగి స్వదేశం వచ్చేందుకు ఆదుకునే హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో హోంమంత్రి చొరవ తీసుకుని బాధితురాలిని స్వగ్రామానికి తీసుకురావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మోసం చేసిన ఏజెంట్ పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తానేటి వనిత భరోసా ఇచ్చారు.  వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంకి చెందిన గెడ్డం ప్రభ (24) (భర్త గెడ్డం రాజకిరణ్) ఉద్యోగం వెతుక్కుంటూ ఫిబ్రవరి 9న మస్కట్ వెళ్లారు. అక్కడ ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుంది. అయితే దళారి నెల రోజుల విజిటింగ్ వీసాతో ఆమెను మస్కట్ కు పంపడంతో నెల రోజుల తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి. పంపించిన ఏజెంట్ కు ఫోన్లు చేసి అడుగుతుంటే.. 2 సంవత్సరాలకు వీసా రెన్యువల్ అయిందని, కంగారు పడాల్సిన అవసరం లేదని కల్లబొల్లి మాటలను నమ్మి తన పనులు తాను చేసుకుంటుంది. రెండు నెలల తర్వాత రంజాన్ పండుగ సమయంలో మే 24న వీసా రెన్యువల్ కాలేనదని మస్కట్ లోని ఆఫీస్ వర్గాలు చెప్పడంతో తాను ఏజెంట్ చేతిలో మోసపోయానని తెలుసుకుంది. మరో రెండు నెలలు మస్కట్ లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ.. అనుక్షణం నరకయాతన అనుభవించింది.  వివరాలను తన తల్లికి, బాబాయికి చెప్పడంతో వాళ్లు వచ్చి విషయమంతా హోంమంత్రి తానేటి వనితకు వివరించారు. వెంటనే హోంమంత్రి స్పందించి జూలై 25వ తేదిన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జై శంకర్ కు లేఖ రాశారు. మస్కట్ లో గెడ్డం ప్రభ పరిస్థితి వివరిస్తూ.. ఎప్పటికప్పుడు మస్కట్ లోని భారతీయ రాయబారి కార్యాలయం అధికారులతో చర్చలు జరిపి చివరకు ఆమెను తిరిగి స్వగ్రామం నిడదవోలు తీసుకురావడానికి కృషి చేశారు.  వెంటనే స్పందించి తాము స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితకు, అధికారులకు ఆ కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Author