చిన్నహుల్తి గ్రామంలో నిలిచిపోయిన శనగ విత్తనాల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో రబీ లో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే పప్పు శనగ విత్తనాల పంపిణీ నిలిచిపోయింది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు రాక పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రబీ సీజన్ లోనైనా పంటలు వేసుకోవడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎకరాకు 20 కేజీలు మాత్రమే శనగ విత్తనాలు ఇవ్వడానికి సన్నద్ధమైంది. దీంతో రైతులు ఎకరాకు 20 కేజీలు ఏమాత్రం సరిపోవని, కనీసం ఎకరాకు 40 కేజీలు శనగ విత్తనాలు ఇవ్వాలని అధికారులను నిలదీశారు. ఈ కారణంగా చిన్నహుల్తి గ్రామంలో శనగ విత్తనాలు పంపిణీ తాత్కాలికంగా అధికారులు ఆపివేశారు. చిన్నహుల్తి గ్రామ రైతు భరోసా కేంద్రం పరిధిలో హోసూరు జొహరాపురం పెద్దహుల్తి జూటూరు గ్రామాలు ఉన్నాయి. ఈ సీజన్లో దాదాపు 5000 ఎకరాల్లో రైతులు రబీ సాగు చేయనున్నారు. అయితే 400 కింటాళ్లు శనగ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఎకరాకు 40 కేజీలు ఇవ్వడం కుదరదని అధికారులు తెగేసి చెప్తున్నారు. రైతులు మాత్రం తమకు తగినన్ని శనగ విత్తనాలు ఇవ్వాలని సచివాలయ కేంద్రాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.