మూడేళ్ల బాబుకు కిడ్నీలో రాళ్లు
1 min read* 21 మిల్లీమీటర్ల రాయిని తీసిన కిమ్స్ సవీరా వైద్యులు
* ఇంత చిన్న బాబుకు ఈ శస్త్రచికిత్స ఇదే ప్రథమం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం: కిడ్నీలో రాళ్ల సమస్య పెద్దవారిలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. వారికి వేర్వేరు విధాలుగా ఈ సమస్యకు చికిత్స చేస్తారు. కానీ, కేవలం మూడేళ్ల వయసున్న ఓ చిన్నారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, అది కూడా పెద్ద పరిమాణంలో ఏర్పడటం సమస్యాత్మకంగా మారింది. అతడికి అనంతపురంలోని కిమ్స్ సవీరా వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, సమస్యను పరిష్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన యూరాలజస్టులు డాక్టర్ నరేంద్రనాథ్ లోకారే, డాక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. “అనంతపురం పట్టణానికి చెందిన మూడేళ్ల వయసున్న మునాఫ్ కుడివైపు తీవ్రమైన కడుపునొప్పితో బయట వైద్యులకు చూపించుకున్నారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా, కుడివైపు కిడ్నీలో రాయి ఉన్నట్లు తెలిసింది. దాంతో కిమ్స్ సవీరా ఆస్పత్రికి పంపారు. అతడికి తగిన పరీక్షలు చేయగా, కుడివైపు కిడ్నీలో 21 మిల్లీమీటర్ల పొడవున్న రాయి ఉన్నట్లు తేలింది. ఇంత చిన్న వయసులో పిల్లలకు కిడ్నీలో రాళ్లు ఏర్పడటమే అరుదు. అందులోనూ ఇంత పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఇంకా అరుదు. పైపెచ్చు సాధారణంగా ఇంత చిన్నపిల్లలకు కిడ్నీలో రాళ్ల సమస్యకు శస్త్రచికిత్స చేయడం కూడా ఈ ప్రాంతంలో ఇంతవరకు జరగలేదు. అయినా… లేజర్, ఎండోయూరాలజీలలో నైపుణ్యం ఉండటంతో వెంటనే బాబుకు రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్) అనే లేజర్ శస్త్రచికిత్సను చేపట్టాం. లేజర్ ఫైబర్ సాయంతో మొత్తం రాయిని పగలగొట్టి, దాన్ని తీసేశాం. మొత్తం శస్త్రచికిత్సకు 45 నిమిషాల సమయం పట్టింది. ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లలకు రాయలసీమ ప్రాంతంలో ఇలా శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారి” అని డాక్టర్ నరేంద్రనాథ్, డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.