15న రాజమండ్రిలో రాష్ట్ర దేవాంగ సంఘం వార్షికోత్సవం
1 min read– దేవాంగుల జనజాగరణ కోసం ‘దేవాంగ యాప్’ ఆవిష్కరణ
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం మరియు వార్షికోత్సవ సభ రాజమహేంద్రవరంలోని జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణమండపంలో జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డీ.కే.నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న దేవాంగులను సమైక్యపరిచి జనజాగరణగా గుర్తించడానికి దేవాంగ ప్రముఖులు సీ.ఎం.ఆర్. అధినేత మావూరి వెంకటరమణ సౌజన్యంతో రూపొందించిన ‘దేవాంగ యాప్’ ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా రానున్న సార్వత్రిక, ఏపీ శాసనసభ ఎన్నికలపై చర్చించడం జరుగుతుందని, ఇప్పటికీ విజయవాడలో జరిగిన గత కార్యవర్గ సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు దేవాంగులకు 5 శాసనసభ, ఒక పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని, ఆ మేరకు ఏ రాజకీయ పార్టీ దేవాంగులకు ప్రాధాన్యత కల్పిస్తుందో వారికే వచ్చే ఎన్నికల్లో మద్దతునిస్తూ మరో మారు సభలో తీర్మానం చేస్తామని నాగరాజు తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునే ఈ సభలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు నిమ్మల కిష్టప్ప, ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్రబాబుతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి దేవాంగ ప్రముఖులు పాల్గొంటారని, దేవాంగ సంఘీయులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని డీ.కే. నాగరాజు కోరారు.