బాణ సంచా దుకాణదారులతో నామమాత్రపు రుసుము వసూలు చేయాలి
1 min readకర్నూలు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు:కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బాణాసంచా దుకాణాదారుల నుండి అధిక మొత్తంలో రుసుము వసూలు చేయొద్దని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని మౌర్య ఇన్ లో పలువురు బాణాసంచా దుకాణాదారులు ఆయన్ను కలిశారు. బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుచేసే తమ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వివరించారు. తమ సమస్యలను అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడపడితే అక్కడ బాణాసంచా దుకాణాలు ఏర్పాటుచేస్తే ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతో దుకాణాలన్నీ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే విధానం కొన్నేళ్లుగా ఉందన్నారు. అయితే ఇక్కడ కూడా నిబంధనలను అతిక్రమించి డబ్బులు వసూలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని దుకాణాదారుల నుండి అక్రమ వసూళ్లు చేయకుండా నామమాత్రపు రుసుము వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యే అయితే ఎలాంటి అక్రమ వసూళ్లు ఉండవని టి.జి భరత్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకే నామమాత్రపు రుసుము పెడతామన్నారు. టి.జి భరత్ ను కలిసిన వారిలో సందీప్, రమేష్, హరి, భువనేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.